తొలగిన మచ్చ.. దక్కిన ఊరట

1 Oct, 2020 07:13 IST|Sakshi

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి.

ఎల్‌కే అడ్వాణీ: బాబ్రీ మసీదు స్థలంలోనే రామాలయాన్ని నిర్మించాలనే డిమాండ్‌తో అడ్వాణీ  దేశవ్యాప్తంగా 1990లో రథయాత్ర నిర్వహించారు. ఈ యాత్రతో దేశంలో బీజేపీ బలం ఎన్నో రెట్లు పెరిగిందని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.  అడ్వాణీ పై బాబ్రీ మసీదు కూల్చివేత అంశం ఇన్నాళ్లూ ఒక మచ్చగా ఉండేది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో ఆ మచ్చ తొలగిపోయినట్లే.

మురళీ మనోహర్‌ జోషీ: బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జోషీ వ్యవహరించారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర.  వాజ్‌పేయి, అడ్వాణీ  సమకాలీనుడైన జోషీ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరు. 86 ఏళ్ల జోషీ ఉత్తరప్రదేశ్‌ నుంచి పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత సన్నిహితుడు.

కల్యాణ్‌ సింగ్‌: ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా కల్యాణ్‌సింగ్‌ ఉన్నప్పుడే అయోధ్యలో బాబ్రీ మసీదు నేలమట్టమైంది. వెంటనే ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. మసీదు కూల్చివేతకు కల్యాణ్‌ సింగ్‌ సంపూర్ణంగా సహకరించారని అభియోగాలు ఉన్నప్పటికీ కేసు నుంచి బయటపడ్డారు. 88 ఏళ్ల కల్యాణ్‌సింగ్‌ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

ఉమా భారతి: బాబ్రీ మసీదు వ్యవహారంలో ప్రముఖంగా వినిపించే మహిళ పేరు ఉమాభారతి. జనాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించడంలో ఆమె దిట్ట. మసీదు కూల్చివేత అనేది అప్పటికప్పుడు జరిగిన ఘటన అని, దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని ఉమా భారతి పలు సందర్భాల్లో చెప్పారు. మసీదు కూల్చివేతపై క్షమాపణ చెప్పడానికి ఏనాడూ ఇష్టపడలేదు.

వినయ్‌ కతియార్‌: హిందూత్వ ఫైర్‌బ్రాండ్‌ నాయకుడు వినయ్‌ కతియార్‌(66). ఆయన బజరంగ్‌ దళ్‌ అధ్యక్షుడిగా, విశ్వ హిందూ పరిషత్‌ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. కల్యాణ్‌ సింగ్, ఉమా భారతి లాగా బీజేపీలో ఓబీసీ నాయకుడిగా ఎదిగారు. పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నాను.

1526  నుంచి 2020 దాకా..
1526: 1526లో బాబర్‌ సైనికాధికారి మీర్‌ బాకీ అయోధ్యలో∙మసీదును నిర్మింపజేశాడు. గుడిని కూల్చి కట్టారా? నేలమట్టమైన గుడిపైన మసీదు కట్టారా? అన్నది స్పష్టంగా తెలియదు. అయితే  విశాలమైన ప్రాంగణంలో మసీదుతోపాటు ఓ గుడి ఉండటం. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకుంటే.. బయట అదే ఆవరణలోని గుడిలో హిందువుల పూజలు జరిగేవన్నమాట.

1949: డిసెంబరు నెలలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. ఇది కాస్తా నిరసన ప్రదర్శనలకు దారితీసింది.  హషీమ్‌ అన్సారీ ముస్లింల తరఫున కేసు వేస్తే తరువాతి కాలంలో నిర్మోహీ అఖాడా హిందువుల వైపు నుంచి కేసు వేసింది.

1984: రామ జన్మ భూమి ఉద్యమాన్ని కొనసాగించేందుకు విశ్వహిందూ పరిషత్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ  ఈ బృందానికి నేతృత్వం వహించారు.

1986: ఫైజాబాద్‌ జిల్లా జడ్జి వివాదాస్పద ప్రాంతపు గేట్లకు వేసిన తాళలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. హిందువులూ ఆ ప్రాంతంలోకి ప్రవేశించవచ్చునని, పూజలు జరుపుకోవచ్చునని తన తీర్పులో పేర్కొన్నారు.

1990: బాబ్రీ మసీదు కూల్చివేతకు మొదటి సారి విఫలయత్నం జరిగింది ఈ ఏడాది.

1992: డిసెంబర్‌ ఆరవ తేదీ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి తాత్కాలిక దేవాలయం ఏర్పాటు చేశారు.

1993: కేసుల సత్వర విచారణకు లలిత్‌పూర్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు. అయితే యూపీ ప్రభుత్వం అలహాబాద్‌ హైకోర్టుతో సంప్రదించి కేసులన్నింటినీ లక్నోలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌ 197 విచారణ సీబీఐ చేపట్టగా మరో కేసు విచారణ రాయ్‌బరేలీలోని ప్రత్యేక కోర్టులో సీఐడీ ఆధ్వర్యంలో జరిగింది. 1993 అక్టోబర్‌లో సీబీఐ శివసేన అధ్యక్షుడు బాలా సాహెబ్‌ ఠాక్రే, బీజేపీ నేత కళ్యాణ్‌ సింగ్, చంపత్‌ రాయ్‌ బన్సల్, ధరమ్‌ దాస్, నృత్య గోపాల్‌దాస్‌ తదితరులపై అభియోగాలు నమోదు చేసింది. మసీదు కూల్చివేతకు ఒక్క రోజు ముందు బజరంగ్‌ దళ్‌ నేత వినయ్‌ కతియార్‌ ఇంట్లో ఒక రహస్య సమావేశం జరిగిందని, అందులోనే మసీదును పడగొట్టేందుకు కుట్ర పన్నారన్నది ఈ అభియోగపత్రంలోని ప్రధాన అంశం. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన అన్ని కేసులూ లక్నోలోని ప్రత్యేక కోర్టు విచారించేలా ఏర్పాటు జరిగాయి.

1996: సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎల్‌కే అడ్వాణీ  తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు నమోదు చేసేందుకు ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎల్‌కే అడ్వాణీ  తదితరులు 1990 నుంచి కుట్ర పన్నారని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

2001: ప్రభుత్వ పరంగా జరిగిన లోటుపాట్ల ప్రస్తావిస్తూ ఎల్‌కే అడ్వాణీ, ఉమాభారతిలు కోర్టు తీర్పును సవాలు చేశారు. లోటుపాట్లను సరిచేస్తామన్న సీబీఐ అభ్యర్థనకు యూపీ ప్రభుత్వం నిరాకరించడంతో నేరపూరిత కుట్ర అరోపణ వీగిపోయింది. రాయ్‌బరేలీ ప్రత్యే కోర్టులో కేసు విచారణ పునఃప్రారంభమైంది. అడ్వాణీ  తదితరులు కేసు గెలిచారు.

2003: రాయ్‌ బరేలీ ప్రత్యేక కోర్టులో సీబీఐ అభియోగపత్రం నమోదు చేయగా.. తగినన్ని ఆధారాలు లేనందున ఎల్‌కే అడ్వాణీని అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని జడ్జి ఆదేశం.

2005: అలహాబాద్‌ హైకోర్టు నేరపూరిత కుట్ర ఆరోపణలు లేకుండా మళ్లీ కేసు విచారణ మొదలుపెట్టింది.

2010: అలహాబాద్‌ హైకోర్టు కింది కోర్టు 2001లో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అడ్వాణీ  తదితరులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు కొట్టివేసింది. రాయ్‌ బరేలీ ప్రత్యేక కోర్టులో మరోసారి కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది.

2012: అలహాబాద్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు సీబీఐ.

2015: బీజేపీ సీనియర్‌ నేతలకు సుప్రీం నోటీసులు

2017: అలహాబాద్‌ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలు. నేరపూరిత కుట్ర ఆరోపణలను పునరుద్దరించాలని స్పష్టీకరణ. అన్ని కేసులను కలిపి లక్నోలో విచారణ చేపట్టాలని ఆదేశాలు.

2019: వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతం మొత్తాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు.

2020: కేసు విచారణకు విధించిన గడువు ఆగస్టు 31తో పూర్తి. తుది గడువును ఒక నెల పొడిగించిన సుప్రీంకోర్టు. సెప్టెంబరు 30వ తేదీన అధారాలు లేని కారణంగా నిందితులందరిపైని ఆరోపణలను కొట్టివేస్తూ లక్నో కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.కే.యాదవ్‌ తీర్పు.

మరిన్ని వార్తలు