ఆ క్విజ్‌ కోసం నమో యాప్‌ ఉండాల్సిందే!

17 Sep, 2020 14:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘నమో యాప్’ ద్వారా తన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. దీంతో నమో యాప్‌ ద్వారా ప్రధానికి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా ఓ ప్రకటన వెలువరించింది. నమో యాప్‌ ద్వారానే ‘నో నమో (Know Namo)‌’ క్విజ్ నిర్వహిస్తున్నట్లు తాజాగా ట్వీట్‌ చేసింది. ఇందులో గెలిచిన వారికి ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌ ఉన్న పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇవాళ ప్రారంభించే ఈ క్వీజ్‌ పోటీలో ప్రధాని మోదీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని వెల్లడించింది. ‘ప్రధాని నరేంద్ర మోదీ గురించి తమకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుసుకోవాలంటే ఈ ‘నమోయాప్’‌లో ఈ రోజు నిర్వహించే ‘ది నో నమో’ క్వీజ్‌లో పాల్గొనాలని.. యాప్‌ డౌన్‌లోడ్‌‌ చేసుకోవాలంటూ http://nm4.in/dnldapp లింక్‌ను‌ ట్విటర్‌లో పంచుకుంది. (చదవండి: కేంద్ర మంత్రులు, రాహుల్‌ గాంధీ విషెస్‌)

ప్రధానికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పాలనుకునే కార్యకర్తలు, ప్రజలు తమ సందేశాలను వీడియో రూపంలో ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా బీజేపీ కోరింది. నమో యాప్‌ వినియోగదారులంతా ప్రధాని జీవితం ఆధారంగా తొలిసారిగా 360 డిగ్రీల వీడియోను ఎగ్జిబిషన్‌ను చూడొచ్చని కూడా పార్టీ తెలిపింది. గ్లింప్సెస్‌ ఆప్‌ నమో ఇన్‌స్పైరింగ్‌ లైఫ్‌ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ ప్రధాని మోదీ స్వస్థలం గుజరాత్‌లోని వాడ్నగర్‌ నుంచి భారత ప్రధానిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్రను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ వారం రోజుల పాటు(సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు) ‘సేవా సప్తా’ కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్యాడ్లు, వీల్‌చైర్‌ల పంపిణీతో పాటు పలు సామాజిక సేవలను చేపట్టనుంది.

మరిన్ని వార్తలు