Chandrakant Patil: ఇష్టం లేకున్నా షిండేను సీఎం చేశాము.. బీజేపీ చీఫ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

24 Jul, 2022 10:00 IST|Sakshi

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రేకు షాకిస్తూ శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా, బీజేపీ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 

అయితే, బీజేపీ నేత ఫడ్నీవీస్‌ కాకుండా ఏక్‌నాథ్‌ షిండే సీఎం కావడంపై బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాటిల్‌ తన అసంతృప్తి వెళ్లగక్కారు. ఈ సందర్బంగా పాటిల్‌ మాట్లాడుతూ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు బదులు శివసేన నేత ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు తీసుకోవాలని పార్టీ బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకుందని అన్నారు. ఏక్‌నాథ్‌ షిండేకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంపై తాము బాధపడ్డామని అన్నారు. మరో ఆప్షన్‌ లేకపోయినందువల్లే అధిష్టానం నిర్ణయం స్వీకరించామని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలందరూ కలత చెందరాని తెలిపారు.

అయితే, పార్టీ ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర పార్టీ చీఫ్‌ అయిన పాటిల్‌ ఇలా సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ షాక్‌ తగిలింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య థాక్రే శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం సాగదని, త్వరలోనే కూలిపోతుందని అన్నారు. కాగా, థాక్రే వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ పాటిల్ తన అసహనాన్ని బయటపెట్టడం విశేషం.

ఇది కూడా చదవండి: 'ఆ రెస్టారెంట్‌ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం' 

మరిన్ని వార్తలు