జేడీయూ, ఎల్జేపీతో కలిసి పోటీ చేస్తాం

23 Aug, 2020 15:10 IST|Sakshi

బిహార్‌ ఎన్డీయే సీఎం అభ్యర్ధిగా నితీష్‌ కుమార్‌

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా ప్రకటించారు. తమ కూటమి బిహార్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌ బీజేపీ రాష్ట్ర కార్యసమితిని ఉద్దేశించి నడ్డా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు బీజేపీతో పాటు జేడీ(యూ), ఎల్జేపీల బలోపేతానికి కృషి చేస్తారని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వాములుగా బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలు బిహార్‌లో కలిసి పోటీచేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్‌లు పసలేని పార్టీలని, విపక్షాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని నడ్డా విమర్శించారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీజేపీకే దేశమంతటా ఆదరణ లభిస్తోందని అన్నారు. బిహార్‌ ప్రభుత్వం కోవిడ్‌-19 మహమ్మారితో పాటు రాష్ట్రంలో వరదలను సమర్ధంగా ఎదుర్కొందని చెప్పారు. బిహార్‌ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మో​దీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్‌ను చిత్తశుద్ధితో అమలు చేశారని ప్రశంసించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్‌ వివరాలను బిహార్‌ బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నడ్డా సూచించారు. ఇక ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీ(యూ), చిరాగ్‌ పాశ్వాన్‌ సారథ్యంలోని ఎల్జేపీల మధ్య మాటల యుద్ధం సాగుతున్నా ఇరు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, బిహార్‌లో నితీష్‌ కుమార్‌ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని బీజేపీ పలుమార్లు స్పష్టం చేసింది. కాగా బిహార్‌లో అసెంబీ​ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌/నవంబర్‌లలో జరగనున్నాయి. చదవండి : ఎన్నికలకు ముందు బిహార్‌లో కీలక పరిణామం

మరిన్ని వార్తలు