జెండాలేని ఇళ్లను ఫొటో తీయండ్రా అబ్బాయిలు.. బీజేపీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

12 Aug, 2022 19:11 IST|Sakshi

Indian Flag On Houses.. దేశవ్యాప్తంగా ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ‘హార్‌ ఘర్‌ తిరంగా’లో భాగంగా జెండాలను ఎగురవేసేందుకు భారతీయలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఇళ్లపై జెండాలను ఎగురువేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇంత వరకు బాగానే ఉన్నా.. జెండాల అంశంపై బీజేపీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ.. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ఈ క్రమంలో ఎవరినీ అనుమానించడం తన ఉద్దేశం కాదంటూ చెప్పుకొచ్చారు. 

అయితే, మహేంద్ర భట్ ఈనెల 10వ తేదీన హల్ద్వానీలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారిని నమ్మవద్దన్నారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలతో చెప్పారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచితేనే దేశ భక్తి ఉన్నట్లుగా, లేకపోతే దేశంపై వారికి నమ్మకం లేదు అంటూ.. ఆయన కామెంట్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో, సర్దుకున్న మహేంద్ర భట్‌ మాట మార్చారు. తనకు ఎవరినీ అనుమానించే ఉద్దేశ్యం లేదన్నారు. ఫొటోలు తీయమన్నది బీజేపీ కార్యకర్తల ఇళ్లనే అంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ‍క్రమంలోనే జాతీయ జెండాను ఇంటిపై ఉంచడంలో సమస్య ఏంటి అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

ఇది కూడా చదవండి: దయచేసి ఆ విషయం అడగకండి.. సీఎం నితీష్‌ రిక్వెస్ట్‌

మరిన్ని వార్తలు