విధాన సభ: అశ్లీలం.. గందరగోళం 

10 Mar, 2021 09:08 IST|Sakshi
విధానసభలో మొదటిరోజు.. చొక్కా విప్పిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంగమేశ్, (ఇన్‌సెట్లో) రభస

విధాన సభలో బీజేపీ– కాంగ్రెస్‌ వాగ్వాదం   

సాక్షి, బెంగళూరు: విధానసభలో మొదటిరోజు షర్టు విప్పి నిరసన తెలపడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బి.సంగమేశ్‌ను సస్పెండ్‌ చేయడం మీద బుధవారం అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవ నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర మాట్లాడుతూ సంగమేశ్‌ అశ్లీలంగా నడుచుకున్నారని ఆరోపించారు. అశ్లీల పదంపై కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. సీడీల్లో అశ్లీలంగా కనిపించే బీజేపీ సభ్యులు తమ అశ్లీలం గురించి మాట్లాడే నైతికత ఉందా అంటూ సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఈ గందరగోళం మధ్యనే సంగమేశ్‌ ప్రవర్తన, సస్పెన్షన్‌ అంశాన్ని సభా హక్కుల సమితికి పంపిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. బెళగావి స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపం, అన్నభాగ్య పథకం అమలులో అక్రమాలు, కరోనా సమయంలో రేషన్‌ బియ్యం పంపణీలో కోత తదితర అంశాలపై మంగళవారం విధానసభలో ప్రతిపక్షాలు సర్కారును నిలదీశాయి.

కార్డుల రద్దు కొనసాగుతుంది  
►అనర్హుల రేషన్‌ కార్డు తొలగింపులను కొనసాగిస్తామని పౌరసరఫరాల మంత్రి ఉమేశ్‌కత్తి విధానపరిషత్‌లో తెలిపారు. గత మూడేళ్లలో 2,28,188 రేషన్‌ కార్డులను రద్దుచేసినట్లు చెప్పారు. 
►ఆరుగురు మంత్రులు తమ పరువుకు భంగం వాటిల్లే ప్రసారాలు చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించడంపై చర్చించాలని  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు విధాన పరిషత్‌లో లేవనెత్తారు. కానీ చైర్మన్‌ చర్చకు తిరస్కరించారు.

ప్రజలపై ధరల మోత: సిద్ధు: ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య మండిపడ్డారు. విధానసభలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాసు ధరల పెంపుపై చర్చ జరిగింది. పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం కష్టంగా మారిందన్నారు. 

కొడగులో పులిని పట్టుకోండి  
కొడగు జిల్లాలో నలుగురిని బలి తీసుకున్న పులిని ఇంతవరకు పట్టుకోలేదని, మీకు చేత కాకుంటే చెప్పండి తాను చూసుకుంటానని విధానసభలో ఎమ్మెల్యే కేజీ బోపయ్య సవాల్‌ చేశారు. అవకాశం ఇస్తే ఆ పులిని పెళ్లి చేసుకుంటానని, ఏ పెళ్లి అనేది తర్వాత చెబుతానని హేళన చేశారు.
చదవండి: తొలి రోజే రచ్చ..
అది నకిలీ సీడీ.. దాని గురించి నాకు ముందే తెలుసు

 

మరిన్ని వార్తలు