ఒవైసీగారు.. ఆ మార్పు మీ దగ్గరి నుంచే ఎందుకు మొదలుకాకూడదు!

26 Oct, 2022 17:06 IST|Sakshi

బీజాపూర్‌: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తాజా వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. హిజాబ్‌ ధరించిన మహిళ భారత్‌కు ప్రధానిగా చూడాలని ఉందంటూ ఒవైసీ కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై విరుచుకుపడ్డారు. 

మంగళవారం కర్ణాటక బీజాపూర్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలోని సెక్యులరిజాన్ని రూపుమాపాలని చూస్తోందని, అందరికీ సమాన అవకాశాలు అనే సిద్ధాంతానికి ఆ పార్టీ పూర్తి వ్యతిరేకమని ఆయన విమర్శించారు. అయితే.. 

ఒవైసీ కామెంట్లకు.. బీజేపీ బదులిచ్చింది. బీజేపీ నేత షెహ్‌జాద్‌ పూనావాలా ట్విటర్‌లో బుధవారం ఒవైసీపై సెటైర్లు పేల్చారు. హిజాబ్‌ ధరించే మహిళ ప్రధాని కావాలని ఒవైసీ కోరుకుంటున్నారు. రాజ్యాంగం ఎవరినీ అడ్డుకోదు కూడా. కానీ, హిజాబ్‌ ధరించిన మహిళ ఏఐఎంఐఎం పార్టీకి ఎప్పుడు ప్రెసిడెంట్‌ అవుతుంది?. ఒవైసీ కోరిక అక్కడి నుంచే ఎందుకు మొదలు కాకూడదు అంటూ షెహ్‌జాద్‌ ట్వీట్‌ చేశారు. 

ఇక హిజాబ్‌ వ్యవహారంలో సుప్రీం జడ్జిలు భిన్నతీర్పులు ఇవ్వడంపైనా ఒవైసీ బీజాపూర్‌లో స్పందించారు. హిజాబ్‌ ధరించి విద్యాలయాలకు వెళ్లడం పెద్ద సమస్యేమీ కాదని జడ్జి వ్యాఖ్యానించారని ఒవైసీ గుర్తు చేశారు. హలాల్‌ మాంసం, ముస్లిం టోపీలు, గడ్డాలు.. ఇలా అన్నింటి నుంచి ప్రమాదమని బీజేపీ భావిస్తోంది. ముస్లింల ఆహార అలవాట్లు కూడా వాళ్లకు సమస్యే. ఇస్లాంకు పూర్తి వ్యతిరేకం ఆ పార్టీ. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి, ఇస్లాం గుర్తింపును ముగించాలన్నదే బీజేపీ అసలు ఎజెండా అని విమర్శలు గుప్పించారు.

ఇదీ చదవండి: ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం

మరిన్ని వార్తలు