తీవ్ర దుమారం రేపుతున్న ముఫ్తీ వ్యాఖ్యలు

24 Oct, 2020 17:17 IST|Sakshi

కశ్మీర్‌ నాయకులు పాకిస్తాన్‌, చైనా వెళ్లండి: బీజేపీ

కశ్మీర్‌: త్రివర్ణపతాకంపై జమ్ముక‌శ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క‌శ్మీర్‌లో ప్రత్యేక జెండా ఎగురవేసే అనుమతి వచ్చే వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయననటంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 14 నెలల నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన ముఫ్తీ నిన్న మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామన్నారు. అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్‌ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకుడు రవీందర్‌ రైనా మాట్లాడుతూ.. ‘ఈ భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించడం.. జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక జెండాను ఎగరవేయడం చేయలేవు. మన జెండా, దేశం, మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారు. జమ్ము కశ్మీర్‌ ఈ దేశంలో అంతర్భాగం. కనుక ఇక్కడ ఒకే ఒక్క జెండా ఎగురుతుంది.. అది కూడా త్రివర్ణ పతాకం మాత్రమే’ అన్నారు. అంతేకాక ముఫ్తీ కశ్మీర్‌ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఏదైనా తప్పు జరిగితే ఆమె తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. శాంతి, సాధారణ స్థితి, సోదరభావానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. అలానే కశ్మీరీ నాయకులు భారతదేశాన్ని అసురక్షితంగా భావిస్తే.. పాకిస్తాన్, చైనా వెళ్ళవచ్చు అన్నారు. (చదవండి: ‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు)

జాతీయ జెండాపై మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ముఫ్తీ వ్యాఖ్య‌లు ఆమోద‌నీయం కాద‌ని.. త్రివ‌ర్ణ ప‌తాకం భార‌తీయుల ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, త్యాగాల‌ను చాటుతుంద‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో దాన్ని త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని కాంగ్రెస్ హిత‌వు ప‌లికింది. 

మరిన్ని వార్తలు