ఎన్నికల రేసులో క్రికెటర్‌ జడేజా భార్య.. బీజేపీ సీటుపై అక్కడ పోటీ

10 Nov, 2022 11:27 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ తమ పార్టీ తరఫున అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, గురువారం ఉదయం గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పేర్లను బీజేపీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ ప్రకటించారు. ఫస్ట్‌ ఫేజ్‌లో భాగంగా 160 స్థానాల్లో పోటీ చేస్తున్న వారి వివరాలను వెల్లడించారు. 

కాగా, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌.. ఘట్లోదియా నియోజకవర్గం నుంచి, హోంశాఖ మంత్రి హర్ష సంఘ్వీ మజురా నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా.. నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి బరిలో దిగనున్నారు. ఇక, ఇటీవలి కాలంలో గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు సైతం కాషాయ పార్టీ టికెట్స్‌ ఇచ్చింది. మాజీ కాంగ్రెస్‌ నేత హార్దిక్‌ పటేల్‌.. విరాంగ్రామ్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఇక, ఇటీవల మోర్బి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు. అలాగే, 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సైతం బీజేపీ టికెట్‌ ఇవ్వకపోవడం విశేషం. 
 

ఇక, గుజరాత్‌లో  182 స్థానాలకు గానూ రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి దశలో 89 స్థానాలకు డిసెంబర్ 1న, రెండో దశలో 93 స్థానాలకు డిసెంబర్‌ 5వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. 

మరిన్ని వార్తలు