ఉచిత వ్యాక్సిన్‌ హామీపై భగ్గుమన్న విపక్షం

22 Oct, 2020 16:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రకటించిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ హామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అజెండా కోసం వ్యాక్సిన్‌ను వాడుకుంటారా అని రాజకీయ ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. బీజేపీయేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి..? బీజేపీకి ఓటు వేయని భారతీయులకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఉచితంగా లభించదా అంటూ అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్వీట్‌ చేసింది. కాగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ విస్తృత స్ధాయిలో అందుబాటులోకి రాగానే బిహార్‌లోని ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రకటించారు. చదవండి : బిహార్‌ ఎన్నికలు: ఇదే బీజేపీ మొదటి హామీ

సోషల్‌ మీడియాలోనూ బీజేపీ వ్యాక్సిన్‌ హామీపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ వ్యాక్సిన్‌ హామీని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తప్పుపట్టారు. బీజేపీ తన పార్టీ నిధులతో ఈ వ్యాక్సిన్‌లు అందిస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నుంచి వీటిని అందచేస్తే బిహార్‌ ప్రజలకే ఉచితంగా అందించి మిగిలిన దేశ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సైతం ఉచిత వ్యాక్సిన్‌ హామీని ఎద్దేవా చేశారు. మాకు ఓట్లు వేస్తే మీకు వ్యాక్సిన్‌ ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీ సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, విపక్షాల విమర్శలను బీజేపీ తోసిపుచ్చింది. ఆరోగ్యం రాష్ట్ర పరిధిలోని అంశమని వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు