అనుకూల ట్వీట్ల స్కాం.. ఆమె ట్వీట్​తో దుమారం

8 Jun, 2021 15:53 IST|Sakshi

నాయకత్వ మార్పు ఊహాగానాలతో యూపీ రాజకీయాలు గత వారం రోజులుగా రసవత్తరంగా నడిచాయి. అయితే యోగి ఆదిత్యానాథ్​ పాలనపై ఢిల్లీ అధిష్టానం సానుకూలంగా స్పందించడం, ఇది మీడియా సృష్టి అని స్వయంగా యోగినే ఆరోపించడంతో ఊహాగానాలకు తెరపడింది. ఈ వేడి చల్లారకముందే ఫేక్​ ట్వీట్ల స్కాం వ్యవహారం యోగి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి యోగి ఆదిత్యానాథ్​కు అనుకూలంగా ట్వీట్లు వేయాలని, అందుకోసం ఒక పోస్ట్​కి 2 రూపాయల చొప్పున చెల్లిస్తామంటూ ఈమధ్య 70 సెకండ్ల నిడివి ఉన్న ఒక ఆడియో క్లిప్​ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది ఫేక్​ అడియో క్లిప్​గా చెబుతున్న కాన్ఫూర్ పోలీసులు.. ఈ వ్యవహారంలో అనుమానితులుగా అశిష్​ పాండే అనే వ్యక్తిని, మరొకతని ఆదివారం అరెస్ట్ చేశారు. ఇది అక్రమ అరెస్ట్​ అని పేర్కొంటూ అశిష్ భార్య, బీజేపీ నేత డాక్టర్​ ప్రీతి ట్వీట్ చేయడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది.

‘అయ్యా యోగిగారు..’ అంటూ మొదలుపెట్టి హిందీలో ఆమె ఒక ట్వీట్ చేసింది. తన భర్త అరెస్టు అక్రమమని, ఆయన నాలుగేళ్లుగా మీ(యోగి) పాలనను నా భర్త గౌరవిస్తున్నాడు. ఇది ఆయన ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారమని, దయచేసి ఆయన్ని కలిసే అవకాశం ఇప్పించాలని, తన భర్త తరపు వాదనను బలంగా వినిపించే అవకాశం తనకు దొరుకుతుందని ఆమె ట్వీట్ చేసింది. కాగా, ప్రీతి బీజేపీ ఎన్జీవో విభాగం కో ఆర్డినేటర్​తో పాటు యూపీ బాలల హక్కుల విభాగంలో సభ్యురాలు కూడా. 

ఇక కాన్పూర్​ పోలీసులు మాత్రం అశిష్​ సోషల్ మీడియా మేనేజ్​మెంట్ కంపెనీ నడిపిస్తున్నాడని, ఫోర్జరీ, ఛీటింగ్​ కేసుల కింద అతన్ని అరెస్ట్ చేశామని చెబుతున్నారు. మరోవైపు లోకల్ మీడియా ఛానెల్స్​.. అశిష్​, హిమాన్షు సైని అనే ఇద్దరూ సీఎంవో, సీఎం యోగిలకు అనుకూల ట్యాగులతో చాలాకాలంగా పోస్టులు పెడుతున్నారనే విషయం వెలుగులోకి తెచ్చాయి. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించకపోవడం విశేషం. 

కాగా, పాండేకి పోటీగా కంపెనీ నడుపుతున్న అతుక్​ అనే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు మద్దతుగా ప్రమోషన్స్​ చేస్తుంటాడు. తనను దెబ్బతీసేందుకే పాండే ఇలాంటి ఫేక్​ ఆడియోను వైరల్ చేశాడని అతుక్​ ఆరోపిస్తున్నాడు. మరోవైపు యోగి సర్కార్​పై తరచూ విరుచుకుపడే ఐఎఎస్​ మాజీ అధికారి​ సూర్య ప్రతాప్​ సింగ్​ 70 సెకండ్ల ఆడియో క్లిప్​ను వైరల్ చేయడంతో.. ఈ వ్యవహారంపై ప్రముఖంగా దృష్టి పెట్టింది అక్కడి మీడియా. అయితే ఫేక్​ ఆడియో క్లిప్​ వైరల్ చేసినందుకు సూర్య ప్రతాప్​పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కాన్పూర్ పోలీసులు మాత్రం అది రెండు వేర్వేరు ఆడియోక్లిప్పుల కలయిక అని, ఫేక్​ ఆడియో క్లిప్​ వైరల్ చేస్తే అరెస్ట్​లు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు