Elections In 2024: అక్కడ గెలుపే టార్గెట్‌.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌

27 Apr, 2022 08:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2024లోనూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కార్యాచరణ మొదలు పెట్టింది. బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో విజయవకాశాలను మెరుగుపరుచుకునేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్‌ పాండా, దిలీప్‌ ఘోష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్యలతో టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.

దేశవ్యాప్తంగా 74 వేల పోలింగ్‌ బూత్‌లలో పార్టీ బలహీనంగా ఉందని 2014, 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీ అంచనాకు వచ్చింది. ఇంతవరకూ గెలవని 100 లోక్‌సభ స్థానాలనూ గుర్తించింది. వీటిల్లో పాగా వేసే వ్యూహాలను టాస్క్‌ఫోర్స్‌ బృందం సిద్ధం చేయనుంది. మూడు నెలలు విస్తృతంగా పర్యటనలు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో భేటీ అవుతుంది. పార్టీ పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరిస్తుంది.

వచ్చే వారం నుంచి పర్యటనలు మొదలవుతాయని సమాచారం. రెండు మూడు రోజుల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ బృందం సమావేశం కానుంది. బలహీనంగా ఉన్న బూత్‌లలో ఎక్కువగా దక్షిణాదిలోనే ఉన్నాయి. కనుక అక్కణ్నుంచే కార్యాచరణ ఆరంభిస్తామని కమిటీ సభ్యుడొకరు చెప్పారు. 

ఇది కూడా చదవండి: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

మరిన్ని వార్తలు