బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు..

15 Mar, 2021 10:23 IST|Sakshi

బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడులో పలువురు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ

పశ్చిమబెంగాల్‌ బరిలో సుప్రియో

తమిళనాడులో నటి ఖుష్బూ 

కేరళ బరిలో ‘మెట్రోమ్యాన్‌’ 

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రిని, ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో సహా నలుగురు ఎంపీలను పశ్చిమబెంగాల్‌లో, ఇద్దరు ఎంపీలను, మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను కేరళలో, ప్రముఖ సినీ నటి, పార్టీ జాతీయ ఆఫీస్‌బేరర్‌ ఖుష్బూను తమిళనాడులో పోటీలో నిలిపింది. పార్టీ ప్రదాన కార్యదర్శి అరుణ్‌సింగ్, బాబుల్‌ సుప్రియో, మరో కేంద్ర మంత్రి దేబశ్రీ చౌధురి ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి 63 మందితో, తమిళనాడు, అస్సాంల్లో 17 మంది చొప్పున, కేరళలో 112 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు.

కేరళలోని మొత్తం 140 స్థానాల్లో 115 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో మిత్ర పక్షాలు పోటీ చేస్తాయని అరుణ్‌ సింగ్‌ వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌లో టాలీగుంగే నుంచి బాబుల్‌సుప్రియో, దిన్హట నుంచి ఎంపీ నిశిత్‌ ప్రామాణిక్, చుంచురా స్థానం నుంచి ఎంపీ లాకెట్‌ చటర్జీలను, తారకేశ్వర్‌ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ స్వపన్‌ దాస్‌ గుప్తాను బరిలో దింపారు. మాజీ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ అశోక్‌ లాహిరికి అలీపుర్‌దౌర్‌ స్థానం కేటాయించారు. లాహిరి 2017 నుంచి 2020 వరకు ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడిగా ఉన్నారు. టికెట్‌ నిరాకరించడంతో తృణమూల్‌ నుంచి బీజేపీలో చేరిన సీనియర్‌ నాయకుడు రవీంద్రనాథ్‌ భట్టాచార్యకు సింగూరు నుంచి అవకాశం కల్పించారు.

సినీతారల్లో తనుశ్రీ చక్రవర్తి(శ్యాంపూర్‌), పాయల్‌ సర్కార్‌(బెహల పుర్బ), యశ్‌దాస్‌ గుప్తా(చండితల)లకు టికెట్లు ఇచ్చారు. అశోక్‌ లాహిరి, స్వపన్‌దాస్‌ గుప్తాలకు అవకాశం కల్పించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమకు దూరంగా ఉన్న రాష్ట్రంలోని మేధావి వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కేరళలో ఇటీవలే బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్‌ ఈ శ్రీధరన్‌ను పాలక్కాడ్‌ నుంచి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ను కంజీరప్పల్లి నుంచి, రాజ్యసభ ఎంపీ, నటుడు సురేశ్‌ గోపీని త్రిస్సూర్‌ నుంచి, మరో నటుడు కృష్ణ కుమార్‌ను తూర్పు తిరువనంతపురం నుంచి బీజేపీ పోటీలో నిలిపింది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన కే సురేంద్రన్‌ కొన్ని, మంజేశ్వర్‌ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్‌ నేత పద్మనాభన్‌కు ముఖ్యమంత్రి విజయన్‌ పోటీలో ఉన్న ధర్మడం స్థానాన్ని బీజేపీ కేటాయించింది. అస్సాంలో బాఘ్‌బర్‌ సీటు నుంచి హసీనారా ఖాతూన్, హాజో స్థానం నుంచి సుమన్‌ హరిప్రియ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చ్‌ 27 నుంచి 8 దశల్లో పశ్చిమబెంగాల్‌లో, మూడు దశల్లో అస్సాంలో, ఒకే దశలో ఏప్రిల్‌ 6న కేరళ, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

చదవండి: అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్‌ పవర్‌

మరిన్ని వార్తలు