మసీదుల్లో మందిరాలను పునరుద్ధరించి తీరతాం!.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యల దుమారం

27 May, 2022 14:16 IST|Sakshi

బెంగళూరు: మసీదుల్లో మందిరాల ఉనికిపై న్యాయస్థానాల్లో విచారణ  కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. 36,000 ఆలయాలను ధ్వంసం చేసి.. మసీదులు కట్టారని, వాటన్నింటిని పునరుద్ధరించి తీరతామని శపథం చేస్తున్నాడాయన. 

కర్ణాటక డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్‌ ఈశ్వరప్ప పై కామెంట్లు చేశాడు. మందిర్‌-మసీద్‌ వ్యవహారంపై మీడియా సాక్షిగా శుక్రవారం ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆలయాలను ధ్వంసం చేసి.. వాటిపై మసీదులు కట్టారు. వేరే ఎక్కడైనా మసీదులు కట్టి.. నమాజ్‌లు చేసుకోండి. అంతేగానీ, ఆలయాల మీద మసీదులను అనుమతించేదే లేదు. ముప్పై ఆరువేల ఆలయాలను హిందువులు తిరిగి అదీ లీగల్‌గా చేజిక్కించుకోవడం ఖాయం అని పేర్కొన్నారు ఆయన. 

జ్ఞానవాపి మసీదు వ్యవహారం కోర్టులో ఉన్న వేళ.. కర్ణాటకలోనూ అదే తరహా వ్యవహారం వెలుగుచూసింది. మంగళూరు దగ్గర ఓ పాత మసీదులో రిన్నోవేషన్‌ పనులు జరుగుతుండగా.. హిందు ఆలయం తరహా నమునాలు వెలుగు చూశాయి. దీంతో.. వీహెచ్‌పీ నేతలు పనులు ఆపించాలంటూ జిల్లా అధికారులను కోరారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈశ్వరప్ప గుడులను పునరుద్ధరించి తీరతామని వ్యాఖ్యానించడం విశేషం. 

ముస్లింలందరూ చెడ్డవాళ్లు కారని, అలాగని ఆలయాలపై మసీదులు నిర్మించి నమాజ్‌లు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఒక మసీదు ఉందంటే.. అది కచ్చితంగా శివుడి ఆలయమే అయ్యి ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈశ్వరప్ప కామెంట్లపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. న్యాయస్థానాల్లో వ్యవహారం ఉండగా.. ఇలాంటి వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడంటూ విమర్శలు గుప్పిస్తోంది. 

మరిన్ని వార్తలు