మహిళకు బీజేపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. కాంగ్రెస్‌ ఆగ్రహం!

3 Sep, 2022 16:13 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబవళి తన ప్రవర్తనతో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. తమ నిర్మాణాలను కూలగొట్టటాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఓ మహిళను ఎమ్మెల్యే బెదిరిస్తూ, తీవ్రంగా దూషించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొద్ది సమయం తర్వాత తిరిగి ఇంటికి పంపించేశారు. అధికారిక పనులకు అడ్డుపడిన కారణంగా మహిళపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు.

ఏం జరిగిందంటే?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బెంగళూరు మొత్తం నీట మునిగింది. ఈ క్రమంలో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో పడ్డారు బెంగళూరు నీటి సరఫరా, మురుగు నిర్వహణ విభాగం అధికారులు. మురుగు నీటి కాలువపై నిర్మించారనే కారణంగా నల్లురహళ్లి ప్రాంతంలోని ఓ కమెర్షియల్‌ భవనం ప్రహరీ గోడను కూల్చేందుకు వచ్చారు. అయితే, ఆ భవనం యజమాని రత్‌ సగాయ్‌ మ్యారీ అమీలా అనే మహిళ దానిని వ్యతిరేకించారు. ప్రభుత్వ సర్వేయర్‌ సర్వే చేసిన తర్వాత, ప్రభుత్వ అనుమతులతోనే నిర్మించామని సూచించారు. అప్పటికే సగం ప్రహరీ గోడను అధికారులు కూల్చారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే లింబవళి.. అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతలను ఆపాలని మహిళ వివరించే ప్రయత్నం చేశారు. పలు పత్రాలను చూపించారు. వాటిని ఆమె నుంచి లాక్కునేందుకు యత్నించారు ఎమ్మెల్యే. జైళ్లో పెట్టిస్తానని ఆమెను బెదిరించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మహిళను అక్కడి నుంచి లాక్కెళ్లి చితకబాదాలని పోలీసులతో అంటున్నట్లు కెమెరాలో నమోదయ్యాయి.

కాంగ్రెస్‌ ఆగ్రహం..
ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‍దీప్‌ సుర్జేవాలా. మహిళల భద్రత కోసం కట్టుబడి ఉంటామన్న బీజేపీ కపటత్వం బయటపడిందన్నారు. ‘మీ పార్టీకి చెందిన అరవింద్ లింబవళి ప్రజాప్రతినిధిగా మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తీరు క్షమించరానిది. బీజేపీ నేత క్షమాపణ చెప్పాలి.’ అని కన్నడలో రాసుకొచ్చారు. 

సుర్జేవాలా ట్వీట్‌కు స్పందిస్తూ తాను క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని, అయితే, ఆ మహిళ కాంగ్రెస్‌ కార్యకర్త అని సూచించారు లింబవళి. ‘నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధమే. కానీ, మీ పార్టీ కార్యకర్త రత్‌ సగాయ్‌ మ్యారీ.. మురికి కాలువును చాలా ఏళ్లుగా ఆక్రమించారు. ప్రజలకు సమస్యలు సృష్టించారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆమెను కోరండి. మొండితనంగా వ్యవహరించటం మాను కోవాలని సూచించండి.’ అంటూ ట్వీట్‌ చేశారు లింబవళి. వరదలకు సంబంధించిన చిత్రాలను పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘బీజేపీలో ఉంటూనే ‘ఆప్‌’ కోసం పని చేయండి’.. కార్యకర్తలకు కేజ్రీవాల్‌ పిలుపు!

మరిన్ని వార్తలు