రక్తదానం.. పండ్ల పంపిణీ.. సేవా కార్యక్రమాలు

14 Sep, 2020 13:25 IST|Sakshi

మోదీ పుట్టిన రోజు సందర్భంగా వారం పాటు కార్యక్రమాలు

లక్నో: ఈ నెల 17 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధ నగర్‌ జిల్లాలోని చప్రౌలి గ్రామంలో ‘సేవా సప్తా’ పేరుతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్‌ 17న మోదీ 70వ ఏట అడుగుపెడుతున్నారు. ఆయన జీవితాన్ని, ప్రయాణాన్ని గమనిస్తే.. ప్రజా సేవ మోదీ జీవితంలో ఓ భాగం. ఆయన తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేశారు. కనుక సెప్టెంబరు 14-20 వరకు వారం రోజుల పాటు ‘సేవా సప్తా’గా పాటించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రజలకు సేవ చేస్తారు’ అని తెలిపారు. అంతేకాక మోదీలోని సేవాతత్పరత ప్రధాని అయ్యాక రాలేదని.. చిన్ననాటి నుంచి ఆయనలో ఈ సేవా గుణం ఉందన్నారు నడ్డా.

ఈ ఏడాది మోదీ 70వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ప్రతి జిల్లాలోని 70 ప్రదేశాల్లో పరిశుభ్రత, పండ్ల పంపిణీ, రక్తదానం చేయాలని నడ్డా కోరారు. అంతేకాక ప్రతి జిల్లాలోని 70 మంది దివ్యాంగులకు పరికరాలను అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. దాంతో పాటు అన్ని జిల్లాల్లో 70 ప్రదేశాలలో 70 వర్చువల్‌ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించాము అన్నారు నడ్డా. ప్రచార ప్రారంభోత్సవానికి హాజరైన వారిలో బీజేపీ రాష్ట్ర యూనిట్ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్, గౌతమ్ బుద్ధనగర్ ఎంపీ మహేష్ శర్మ, రాజ్యసభ ఎంపీ సురేంద్ర నగర్ మరియు స్థానిక ఎమ్మెల్యేలు పంకజ్ సింగ్, ధీరేంద్ర సింగ్, తేజ్పాల్ నగర్ ఉన్నారు.

మరిన్ని వార్తలు