పొలిటికల్‌గా ఓకే కానీ.. సబ్జెక్టులోనే వీక్‌.. అడ్డంగా బుక్కైన బీజేపీ నేత

15 Aug, 2022 07:50 IST|Sakshi

సాక్షి, చెన్నై : తన బదులు మరొకరితో పరీక్ష రాయించేందుకు ప్రయత్నించిన తిరువారూర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్‌ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.  కాగా.. తిరువారూర్‌ సమీపంలోని గ్రామ కొండాన్‌ తిరువికా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ఓపెన్‌ వర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన పొలిటికల్‌ సైన్స్‌ రెండో సంవత్సరం పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిపై ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి హాల్‌ టికెట్‌ క్షుణ్ణంగా పరిశీలించారు.

అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి విచారించారు. వ్యవహారం తొలుత రహస్యంగానే సాగినా, పోలీసులు రంగంలోకి పోలీసులు దిగి పరీక్షకు హాజరైన వ్యక్తి తిరువారూర్‌ సభాపతి మొదలియార్‌ వీధికి చెందిన దినకరన్‌(39)గా గుర్తించారు. ప్లస్‌ టూ పూర్తి చేసి, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై దృష్టి పెట్టిన దినకరన్‌ అప్పుడప్పుడు రోడ్డు సైడ్‌ బిర్యానీ కొట్టు నడిపేవాడని తేలింది. పూర్తి వివరాలు చెప్పకపోవడంతో పోలీసులు స్టేషన్‌కు తరలించి తమదైన స్టైల్లో విచారించారు.

బీజేపీ విద్యార్థిసంఘం నేత రమేష్‌ తనను పరీక్ష రాయమని పంపించాడని, ఎవరి బదులు పరీక్ష రాస్తున్నానో తెలియదని తెలిపాడు. అర్ధరాత్రి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తిరువారూర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్‌ రాయాల్సిన పరీక్షకు దినకరన్‌ను పంపినట్లు తెలిపాడు. వెంటనే భాస్కర్‌ను కూడా పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో పట్టు లేకపోవడంతో తన బదులు మరొకరిని పరీక్షకు పంపించినట్టు అంగీకరించాడు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి, ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: బీజేపీకి బిగ్‌ షాక్‌..

మరిన్ని వార్తలు