మోదీ హయాంలో అత్యున్నత శిఖరాలకు భారత్‌...

24 Jan, 2021 20:00 IST|Sakshi

హైదరాబాద్‌: తాను రచించిన "బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్" అనే పుస్తకంపై జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో బీజేపీ జాతీయ నేత  రాం మాధవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అమెరికా ఫస్ట్' స్పూర్తితో 'ఇండియా కమ్స్ ఫస్ట్'  పుస్తకానికి నామకరణం చేయడం జరిగిందని అన్నారు. మోదీ హయాంలో భారత్‌ అత్యున్నత శిఖరాలకు చేరుకుందని, మోదీ వల్లే  'ఇండియస్ ఫస్ట్' సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల నేతలతో సత్సంబంధాలు కలిగివుంటారని, అది భారత్‌కు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. 

గతంలో దేశంలో ఎక్కడో ఒక చోట ఉగ్ర దాడులు జరిగేవని, ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు మోదీ అనుసరిస్తున్న విధానాలు సత్ఫలితాల్ని ఇచ్చాయని రాం మాధవ్‌ పేర్కొన్నారు. అయోధ్య పేరులోనే శాంతి ఉందని, రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ముస్లింలతో సహా అన్ని మతాలు స్వాగతించాయని ఆయన గుర్తు చేశారు. భారత్‌, అమెరికా మధ్య సత్సంబందాలు మోదీ హయాంలో నిరాటంకంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భారత్‌ జాతీయవాదాన్ని మరింత పటిష్టపరుచుకోవాలని.. జాతీయం, జాతీయవాదం రెండు భిన్నమైనవని ఆయన అభిప్రాయడ్డారు.

1962 భారత్, చైనా యుద్ధం ప్రస్తావన రాగా.. గతంలో భారత్‌, చైనా కంటే బలహీనమైన దేశంగా ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని, అందుకు మోదీ విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా హవాను ఎదుర్కోవడం భారత్‌కు పెద్ద సవాల్‌ అని అభిప్రాయపడ్డారు. 2017 డోక్లాం ఘటన తరువాత సరిహద్దు వివాదాల్లో భారత్‌ తీరు మారిందని ఆయన గుర్తు చేశారు. తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు భారత్‌ ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చైనా ఎదుగుదలకు భారత్‌ వ్యతిరేకం కాదని, అలాగని కయ్యానికి కాలు దువ్వితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు