చౌకగా పెట్రోల్‌ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్‌ వెళ్లండి: బీజేపీ నేత

20 Aug, 2021 13:34 IST|Sakshi

భోపాల్: కరోనా మహమ్మారి దేశాన్ని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. తాజాగా ఇంధన ధరలపై ప్రశ్నించిన మీడియా మిత్రులతో మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ ధరకు కావాలంటే అఫ్గనిస్తాన్‌ కి వెళ్లండి.. అక్కడైతే చౌకగా పెట్రోల్‌ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు. కట్నిలో ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ని ఇంధన ధరలపై ప్రశిస్తే.. ‘తాలిబన్‌ పాలిత ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ పెట్రోల్‌ రూ.50కే దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు వివరణగా.. కరోనా సెకండ్ వేవ్‌ వచ్చి దేశాన్ని అతలా కుతలం చేసిందని.. త్వరలో థర్డ్ వేవ్‌ రాబోతుందన్నారు.

ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల బదులుగా కోవిడ్ మూడవ వేవ్ గురించి ఆలోచించాలని రిపోర్టర్‌కు సూచించారు. అయితే, ఈ కార్యక్రమంలో రామ్ రతన్ పాయల్, మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు ఎవరూ మాస్క్‌లు ధరించలేదు. ఇక బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చౌకబారు మాటలు మట్లాడుతున్నారని మండిపడింది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.27 ఉంది.

మరిన్ని వార్తలు