ద్రవ్యోల్బణానికి కారణం నెహ్రూ ప్రసంగం

1 Aug, 2021 08:56 IST|Sakshi

భోపాల్‌: ద్రవ్యోల్బణం అనే సమస్య నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదని, 1947 ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన ప్రసంగంతోనే దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం మొదలయ్యిందని మధ్యప్రదేశ్‌ వైద్య విద్య శాఖ మంత్రి, బీజేపీ నేత విశ్వాస్‌ సారంగ్‌ ఆరోపించారు. ఈ ప్రసంగంలో ఎన్నో తప్పిదాలు దొర్లాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ అనేది ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుందని, నెహ్రూ ఆ రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సారంగ్‌ శనివారం భోపాల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితికి నెహ్రూ అనుసరించిన తప్పుడు విధానాలే కారణమన్నారు. ధరల పెరుగుదలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారి, ద్రవ్యోల్బణం పెరిగిందని, ఈ ఘనత నెహ్రూ కుటుంబానికే చెందుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా శ్రమిస్తోందని చెప్పారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం తగ్గుతోందని, ప్రజల ఆదాయం పెరుగుతోందని విశ్వాస్‌ సారంగ్‌ ఉద్ఘాటించారు. దేశాభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమే అయినప్పటికీ అది వ్యవసాయ ఆధారితమై ఉండాలన్నారు. కశ్మీర్‌ వివాదం, అంతర్గత భద్రతకు సవాళ్లు, సరిహద్దు గొడవలు నెహ్రూ కాలం నుంచే కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ఇవి కూడా కారణమేనని పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు