ఉగ్రదాడి.. బీజేపీ సర్పంచ్‌ దారుణ హత్య

9 Aug, 2021 20:59 IST|Sakshi
కుల్గాంలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన కిసాన్ మోర్చా అధ్య‌క్షుడు, సర్పంచ్‌ గులాం రసూల్‌ దార్‌ (ఫైల్‌ఫోటో)

కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ నేత, అతడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అనంత‌నాగ్‌లోని లాల్ చౌక్‌లో సోమవారం జ‌రిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్య‌క్షుడు, సర్పంచ్‌ గులామ్ ర‌సూల్ దార్‌తో పాటు ఆయ‌న భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఉగ్ర‌వాదుల దాడుల్లో కిసాన్ మోర్చా అధ్య‌క్షుడు చ‌నిపోయిన‌ట్లు మ‌రో బీజేపీ నేత అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు. అమాయకులును బలి తీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 

ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఈ దారుణాన్ని ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘కుల్గాంలో జరిగిన కాల్పుల్లో కిసాన్ మోర్చా అధ్య‌క్షుడు, సర్పంచ్‌ గులామ్ ర‌సూల్ దార్‌తో పాటు ఆయ‌న భార్య జవహీరా బానూ మృతిచెందారు. ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపంద చర్య.. హింసకు పాల్పడిన వారిని అతి త్వరలో న్యాయస్థానం ముందు నిలబెడతాం. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ మనోజ్‌ సిన్హా ట్వీట్‌ చేశారు.

మ‌రో వైపు పూంచ్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ ద‌ళాలు నిర్వ‌హించిన త‌నిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు ల‌భ్య‌మ‌య్యాయి. ఇంటెలిజెన్స్ స‌మాచారం ప్ర‌కారం.. బీఎస్ఎఫ్ ద‌ళాలు జాయింట్ ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. విల్ సంగ‌ద్ అట‌వీ ప్రాంతంలో జ‌రిగిన గాలింపులో ఆయుధాలు దొరికాయి. వాటిల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు