కోవిడ్‌ వచ్చిందని పెళ్లయిన నాలుగు రోజులకే తరిమేశాడు..

27 Jun, 2021 01:02 IST|Sakshi

ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యేపై భార్య ఆరోపణ

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియా వేధిస్తున్నా డంటూ ఆయన భార్య ఓషిన్‌ శర్మ ఆరోపించారు. గురువారం అతడు మూడు పర్యాయాలు తనపై చేయిచేసుకున్నాడని పేర్కొన్నారు. విశాల్‌ నెహ్రియా తనను పలుమార్లు శారీరకంగా, మానసికంగా హింసించాడని ఆరోపిస్తూ ఓషిన్‌ శర్మ శనివారం పోస్టు చేసిన 11 నిమిషాల నిడివి ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కంగ్రా జిల్లా నగ్రోటా సురియన్‌ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తున్న ఓషిన్‌ శర్మకు, ధర్మశాల ఎమ్మెల్యే విశాల్‌ నెహ్రియాతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహమైంది. తనకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో పెళ్లయిన నాలుగు రోజులకే భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అందులో తెలిపారు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటున్నట్లు చెప్పారు. నెహ్రియాతో తనకు కాలేజీ రోజుల నుంచే పరిచయముందనీ, అయితే, తనను కొడుతుండటంతో అప్పట్లోనే అతడితో తెగదెంపులు చేసుకున్నట్లు ఆ వీడియోలో ఆమె పేర్కొన్నారు.

నెహ్రియా 2019లో ధర్మశాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వివాహ ప్రస్తావన తేగా, అతడు మారి ఉంటాడని భావించినట్లు తెలిపారు. పెళ్లికి ముందు, ఫిబ్రవరిలో చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో అతడు తనను దారుణంగా కొట్టాడని, అత్తింటి వారు బతిమాలడంతో పెళ్లికి అంగీకరించి నట్లు చెప్పారు. కాగా, అత్తింటి వారు కూడా అదనంగా కట్నం తేవాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై విశాల్‌ నెహ్రియా స్పందించలేదు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు