Haryana: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కారు ధ్వంసం

5 Nov, 2021 20:04 IST|Sakshi

ఛండీఘర్: బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారును హర్యానాలోని హిసార్‌లో కొంతమంది రైతు నిరసనకారులు ధ్వంసం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ ఎంపీ రామ్‌ చందర్‌ జాంగ్రాను పెద్దఎత్తున రైతులు నల్ల జెండాలు పట్టుకొని, నిరసన తెలుపుతూ అడ్డగించారు. ఈ క్రమంలోనే కొంతమంది నిరసనకారులు ఆయన కారు అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే ఎంపీ రామ్ చందర్‌ జాంగ్రా గురువారం దీపావళి వేడుకల్లో పాల్గొని.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు.. నిరుద్యోగ తాగుబోతులని వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. దీంతో శుక్రవారం రైతులు ఎంపీని హిసార్‌లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ అడ్డగించారు. రైతుల నిరసన కొంత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా మాట్లాడుతూ.. ‘నేను పాల్గొన్న ఓ ప్రైవేట్‌ కార్యక్రమం ముగిసిన అనంతరం మరో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లుతున్నాను. ఇంతలోనే కొంతమంది నిరసనకారులు కర్రలతో నా  కారును ధ్వంసం చేశారు’ అని పేర్కొన్నారు.అదేవిధంగా ఈ ఘటన తనపై అత్యాప్రయత్నం వంటిదని, దుండగులను కఠినంగా శిక్షించాలని ఎంపీ రామ్ చందర్ జాంగ్రా రాష్ట్ర డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తాను హాజరైన కార్యక్రమం రాజకీయమైనది కాదని తెలిపారు. హర్యానాలో సోదరభావం తగ్గుతోందని, సామాజిక అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాదిన్నర నుంచి సుప్రీం కోర్టు నూతన వ్యవసాయ చట్టాలపై స్టే విధించిందని, రైతులు ఎందుకు నిరసన తెలుతున్నారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు