అత్తింటి వేధింపులు: బీజేపీ ఎంపీ కోడలి ఆత్మహత్యాయత్నం

15 Mar, 2021 14:46 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కౌశల్‌ కిశోర్‌ కోడలు అంకిత

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన దారుణం

భర్త, అత్తమామలే తన చావుకి కారణం అంటూ వీడియో పోస్ట్‌

లక్నో: చాన్స్‌ దొరికితే చాలు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్త్రీల పట్ల మర్యాదగా నడుచుకోవాలి.. వారిని ఎదగనివ్వాలి.. మన ఇంటికి కోడలిగా వచ్చిన ఆడపిల్లను కూతురుగా చూడాలి అంటూ గొప్ప గొప్ప మాటలు చెబుతారు. చేతల్లో మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రవర్తిస్తారు. ఎంత గొప్ప చదువులు చదివినా.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఆడవారి విషయం వచ్చే సరికే అవేమి గుర్తుకు రావు వారికి. తమ మాటలు, చేతలతో వారిని చిత్ర హింసలకు గురి చేస్తారు. అత్తింటి వారు పెట్టే చిత్ర హింసలకు తట్టుకోలేక అర్ధంతారంగా తనువు చాలించే ఆడవాళ్లు కోకొల్లలు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్తింటి వారు పెట్టే బాధలు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక్కడ సదరు అత్తింటి వారు సామాన్యులు అయితే మనం చెప్పుకునేవాళ్లం కాదు. 

కానీ ఇక్కడ బాధితురాలి మామ ఎంపీ కాగా.. అత్త ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కౌశల్ కిశోర్ కోడలు అంకిత ఆదివారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో తన చేతి నరాలను కోసుకున్నారు. తీవ్రంగా రక్తస్రావమై స్పృహ కోల్పోయిన అంకితను లక్నో సివిల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేయడానికి ముందు అంకిత అత్తింటి వారి వల్ల తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ.. రెండు వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

వీటిలో అంకిత ‘‘నా భర్త ఆయుష్‌, మామ ఎంపీ కౌషల్‌ కిశోర్‌, అత్త అయిన ఎమ్మెల్యే జై దేవితో పాటు నా భర్త సోదరులు నన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ బాధలు భరించలేక చనిపోవాలనుకుంటున్నాను. అత్తమామలతో పాటు నా భర్త, అతడి సోదరులే నా చావుకు కారణం’’ అంటూ అంకిత వీడియోలో అత్తింటి వారిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక ఈ వీడియోలు రెండు సోషల్‌ మీడియలో వైరల్‌ కావడంతో సమాచారం పోలీసులకు తెలిసింది. దాంతో అలీగంజ్ ఎస్పీ అఖిలేష్ సింగ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి, ఆమె కోసం గాలించారు. అర్థరాత్రి దాటాక స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న అంకితను గుర్తించి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 

అంకిత, ఆయూష్‌ గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయూష్‌ కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని అంగీకరించకపోవడంతో అతను తన భార్య అంకితతో కలిసి మాండియాన్‌ మొహల్లా ప్రాంతంలో అద్దెకుంటున్నాడు. మరో ట్విస్ట్‌ ఏంటంటే ఈ నెల 3న ఆయూష్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. పోలీసుల దర్యాప్తులో తనపై తానే కాల్పులు జరుపుకున్నట్లు వెల్లడించాడు. ఇక నాడు ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన ఆయూష్..‌ అంకిత ఆత్మహత్యాయత్నం తరువాత వెలుగులోకి వచ్చాడు. అది కూడా పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇవ్వడం కోసం. కౌషల్‌ కిశోర్‌ మోహన్‌లాల్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఇక ఈ ఘటనపై విపక్షాలు మండి పడుతున్నాయి. ఎంపీ తన కోడలినే ఇలా వేధిస్తున్నాడంటే.. ఇక సామాన్యులకు ఏం న్యాయం చేయగలడు అని ప్రశ్నిస్తున్నారు. 

చదవండి: 

సీఎం సాబ్‌... నాకు పెళ్లి కూతుర్ని చూడండి

జీన్స్‌, షార్ట్స్‌ వేస్తే ఊరు దాటాల్సిందే..

మరిన్ని వార్తలు