సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

27 Oct, 2020 11:33 IST|Sakshi

హిందువులకు ఇరుకైన స్మశానవాటికలు

ము‍స్లింలకు విశాలమైన స్మశానాలా?

బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: మరో వారం రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న వేళ ఉన్నావ్‌ బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కటియార్‌కు మద్దతుగా నిన్న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. హిందువులకు, ముస్లింలకు సంబంధించిన స్మశాన వాటికల గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులకు ఇరుకైన శ్మశాన వాటికలుంటే, ముస్లింలకు మాత్రం విశాలమైన శ్మశాన వాటికలు ఉన్నాయని.. ఇది పూర్తిగా వివక్షేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జనాభా ప్రాతిపదికన శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకే ఒక్క ముస్లిం ఉన్నా వారి శ్మశాన వాటిక మాత్రం చాలా పెద్దగా ఉంటోందని, హిందువులు మాత్రం తమ ఆత్మీయులకు పొలాల పక్కన దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇదెక్కిడి న్యాయం?’ అని ప్రశ్నించారు. ఇక ఉపేక్షించలేమని, ఎవరూ మన ఓపికను పరీక్షించకూడదని సాక్షి మహరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికలపై ఏవిధంగా ప్రభావితం చూపుతాయో తెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌ సింగ్‌ సెంగర్‌పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ ఎన్నికలపై ఏవిధంగా ప్రభావం చూపనున్నాయో తెలియాల్సి ఉంది. 

చదవండి: ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవులు

మరిన్ని వార్తలు