కేంద్రంపై బీజేపీ ఎంపీ ఫైర్‌.. జాతీయ జెండాకే చెడ్డపేరు తెస్తారా?

10 Aug, 2022 15:15 IST|Sakshi

ఢిల్లీ/ఛండీగఢ్‌: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను దేశం మొత్తం ఘనంగా నిర్వహిస్తోంది  కేంద్ర ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రాలు కూడా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను తమ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నాయి. అయితే.. ఈ వేడుకలు పేదలకు భారంగా పరిణమించాయంటున్నారు బీజేపీ నేత వరుణ్‌ గాంధీ.

బీజేపీ నేత వరుణ్‌ గాంధీ మరోసారి కేంద్ర వ్యతిరేక స్వరం వినిపించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పేదలకు భారంగా మారడం దురదృష్టకరం అంటూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారాయన. రేషన్‌ కోసం వెళ్తున్నవాళ్లు.. జాతీయ జెండా కొంటేనే రేషన్‌ ఇస్తామంటూ డీలర్లు బలవంతం చేయడం సిగ్గుచేటంటూ వరుణ్‌ గాంధీ ఆరోపించారు. ప్రతి భారతీయుడి గుండెల్లో బతుకుతున్న 'తిరంగ'.. నిరుపేదల ఆహారాన్ని లాగేసుకోవడం సిగ్గుచేటన్నారు.

హర్యానా కర్నల్‌లో జాతీయ జెండా కోసం 20రూ. డిమాండ్‌ చేయడం, అలా కొంటేనే రేషన్‌ ఇస్తామని డీలర్లు బలవంతం చేయడం.. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఆ రేషన్‌ డిపో ఓనర్‌ లైసెన్స్‌ రద్దు చేశారు. రేషన్‌ డిపోలో జాతీయ జెండాలు అమ్మకానికి ఉంచిన మాట వాస్తవమేనని, అయితే.. కొనుగోలు చేయాలని రేషన్‌ లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి లేదని అధికారులు అంటున్నారు. 

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమానికి పిలుపు ఇచ్చింది. అంతేకాదు సోషల్‌ మీడియాలో ప్రొఫైల్‌ పిక్స్‌గా మువ్వన్నెల జెండాలను ఉంచాలన్న ప్రధాని పిలుపునకు మంచి స్పందనే లభిస్తోంది. 

మరోవైపు యూపీ పిలిభిత్ నియోజకవర్గం బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ.. ఈ మధ్యకాలంలో కేంద్రంపై వరుసగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సీనియర్‌ సిటిజన్లకు రైల్వే కన్షెషన్‌ రద్దు చేయండం, ప్యాకేజీ ఫుడ్‌ ఐటెమ్స్‌ మీద జీఎస్టీ, అగ్నిపథ్‌ నియామక ప్రకటన.. ఇలా దాదాపు చాలావరకు కేంద్ర నిర్ణయాలపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు

  

మరిన్ని వార్తలు