గర్వంగా ఉంది.. లాలూ కూతురు రోహిణిపై బీజేపీ ప్రశంసలు

6 Dec, 2022 12:37 IST|Sakshi

ఢిల్లీ: మానవ సంబంధాల కంటే డబ్బుకి, సంఘంలో పేరుప్రతిష్టలు, పరపతికే ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. అయినవాళ్లను కూడా దూరంగా పెడుతున్నారు కొంతమంది. అయితే.. కన్నవాళ్ల కోసం, వాళ్ల ఆరోగ్యం కోసం తాపత్రయ పడే పిల్లలకు సమాజంలోని తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలా.. రాజకీయ దిగ్గజం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు రోహిణి ఆచార్యపై ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. 

బీజేపీ ఫైర్‌బ్రాండ్‌, బీహార్‌ నేత గిరిరాజ్‌ సింగ్‌.. లాలూ యాదవ్‌పై మామూలుగా విరుచుకుపడరు. అలాంటి వ్యక్తి.. లాలూ కూతురిపై ఆశ్చర్యకరంగా ప్రశంసలు గుప్పించారు. ‘‘రోహిణి ఆచార్య.. కూతురు అంటే నీలా ఉండాలి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. తర్వాతి తరాలకు నువ్వు(రోహిణిని ఉద్దేశిస్తూ..) ఒక ఆదర్శప్రాయంగా నిలిచావు అంటూ పోస్ట్‌ చేశారు. 

మరో బీజేపీ నేత నిషికాంత్‌ దుబే సైతం రోహిణిపై పొగడ్తలు గుప్పించారు. నాకు కూతురు లేదు. కానీ, ఇవాళ రోహిణిని చూశాక.. దేవుడితో పోరాడైన సరే నాకు ఓ కూతురిని ఇవ్వమని కోరాలని ఉంది అంటూ ట్వీట్‌ చేశారాయన. 

ఇదిలా ఉంటే.. లాలూ పెద్ద కూతురు మీసా భారతి, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ సైతం గత సాయంత్రం లాలూ సర్జరీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 70 ఏళ్ల వయసున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో 40లో ఉన్న రోహిణి ఆచార్య.. తన కిడ్నీని తండ్రికి దానం ఇచ్చింది. సింగపూర్‌లో సోమవారం కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతమైంది.

మరిన్ని వార్తలు