రికార్డు తిరగరాసిన బీజేపీ.. జోష్‌లో కాషాయ నేతలు

1 Apr, 2022 19:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటోంది. తాజాగా బీజేపీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బీజేపీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో 101 మంది సభ్యులను కలిగి ఉన్న ఘనత సాధించింది. దీంతో పలు విషయాల్లో బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంది.

అయితే, గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 13 స్థానాలకు గాను బీజేపీ 4 సీట్లు గెలుచుకుని ఈ అరుదైన ఫీట్ సాధించింది. మూడు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే వరకు ఉన్న 97 సీట్లకు గాను సంఖ్య సెంచరీని క్రాస్‌ చేసింది. మరోవైపు..  కాంగ్రెస్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం లేకపోవడం కూడాఇదే మొదటిసారి. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య 29కి పడిపోయింది. ఇక, ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మరోసారి తమ సత్తా చాటుతూ రాష్ట్రంలోని మొత్తం ఐదు సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో ఆప్ సంఖ్యా బలం ఎనిమిదికి పెరిగింది.

ఇదిలా ఉండగా.. 1988 తర్వాత ఈ రికార్డు సాధించిన తొలి పార్టీగా బీజేపీ అవతరించింది. అంతకు ముందు కాంగ్రెస్‌ 1962లో అ‍త్యధికంగా 162 సీట్లను కలిగి ఉంది. 1988 వరకూ కాంగ్రెస్ పార్టీకి ఉభయసభల్లో సంపూర్ణ మెజారిటీ ఉండేది. దీంతో వారు సొంతంగా బిల్లులు నెగ్గించుకోవడంలోగానీ లేక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వస్తున్నాయి.

తాజాగా 34 ఏళ్ల తర్వాత బీజేపీ ఈ రికార్డును సాధించింది. దీంతో పెద్దల సభలో ఏ బిల్లు అయినా సొంత మెజారిటీతో ఆమోదింపజేసుకునే అవకాశం బీజేపీకి లభించింది. అంతే కాదు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బీజేపీకి చెందిన అభ్యర్ధుల్ని నిలబెట్టి గెలిపించుకునే అవకాశం దక్కబోతోంది. అయితే, 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఆ పార్టీకి 55 సీట్లు ఉండగా.. క్రమంగా సీట్లు పెరగడం విశేషం. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు తగ్గుతూ వస్తున్నా​యి. ప్రధాని నరేంద్ర మోదీ హవాతో బీజేపీ దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ విజయాలను అందుకోవడంతో సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కాషాయ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు