సార్వత్రిక ఎన్నికలపై బీజేపీ గురి

3 Dec, 2022 05:34 IST|Sakshi

సోమవారం నుంచి రెండు రోజులు పార్టీ ఆఫీస్‌ బేరర్ల సమావేశం

హాజరు కానున్న పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు

సాక్షి, న్యూఢిల్లీ:  2024 సార్వత్రిక ఎన్నికలపై అధికార బీజేపీ దృష్టి సారించింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం నుంచి రెండు రోజుల పాటు జాతీయ, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పార్టీ జాతీయ కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జిలు ఇందులో పాల్గొంటారు.

దిశానిర్దేశం చేయనున్న నడ్డా  
గత లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి అంతకుమించి నెగ్గాలని లక్ష్యం నిర్దేశించుకుంది. 2014, 2019ల్లో చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు సాధించని 144 నియోజకవర్గాలను బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఈ లోక్‌సభ స్థానాలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పాగా వేసేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నలుగురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఈ బృందం పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించింది. మరోవైపు ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఇప్పటికే కేంద్ర మంత్రుల బృందాలు పర్యటించాయి.

ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై జేపీ నడ్డా పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల భేటీలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కచ్చితంగా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నలోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో జరగబోయే త్రిపుర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షిస్తారు. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, మరింత చేరువ కావాల్సిన ప్రాంతాలు, వర్గాలను గుర్తించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడానికి వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఆఫీసు బేరర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే అవకాశం ఉందని మరో నాయకుడు చెప్పారు.   ­

అమరీందర్‌కు కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకున్న పలువురు పంజాబ్‌ నేతలకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్, మాజీ ఎంపీ సునీల్‌ జాఖడ్,యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి జైవీర్‌ షేర్‌గిల్‌ను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు