కశ్మీరి పండిట్లపై వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి.. తీవ్ర హెచ్చరికలు

30 Mar, 2022 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.  కశ్మిరీ పండిట్లపై ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బుధవారం ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు.. సీఎం ఇంటిముందు ఉన్న మెయిన్‌గేట్‌, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ బారికేడ్లను ధ్వంసం చేశారు. అంతేగాక సీఎం ఇంటి గోడలపై పెయింటింగ్‌ పూశారు. అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

కాగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్‌ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. సినిమాలో పండిట్లను తరిమేసినట్లు, ఊచకోత కోసినట్లు చూపించడం అబద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రానికి బీజేపీ చేస్తున్న ప్రచారంపై కూడా విమర్శలు గుప్పించారు.

దీంతో సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నేతృత్వంలో ఆ పార్టీ మోర్చా కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఐపీ కాలేజ్‌ నుంచి సీఎం ఇంటి వద్దకు చేరుకొని దాడికి ప్రయత్నించారు. హిందువులను కించపరిచేలా మాట్లాడిన కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీ సూర్య డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ యువ మోర్చా విడిచిపెట్టదని హెచ్చరించారు. ఈ మేరకు ఎంపీ ట్వీట్‌ చేశారు.  

మరోవైపు  కేజ్రీవాల్ నివాసాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘సీఎం కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ దాడి చేశారు. సెక్యూరిటీ బారికేడ్లను పగలగొట్టారు.  సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గేటును పడగొట్టారు. ఇదంతా ఢిల్లీ పోలీసుల పూర్తి మద్దతుతోనే జరిగింది.  ఇంతకీ ఈ డిమాండ్లన్నీ కశ్మీరీ పండిట్‌లకు పునరావాసం కల్పించాలనే చేస్తున్నారా?’ అంటూ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు