BJP MLA Rahul Narvekar: మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్‌ నర్వేకర్‌.. థాక్రేకు షాక్‌

3 Jul, 2022 12:59 IST|Sakshi

మహారాష్ట్రలో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ శిండే సర్కార్‌ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. 

అందులో భాగంగానే ఆదివారం, సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజైన ఆదివారం.. స్పీకర్‌ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్‌ నర్వేకర్‌.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్‌ సాల్వీ పోటీపడ్డారు. ఈ పోటీలో రాహుల్‌ నర్వేకర్‌ స్పీకర్​ పదవికి ఎన్నికయ్యారు. దీంతో మాజీ సీఎం ఉద్ధవ్‌ వర్గానికి షాక్‌ తగిలింది.

ఇదిలా ఉండగా, సోమవారం మహా అసెంబ్లీలో కొత్త సీఎం ఏక్‌నాథ్‌ శిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. వీరంతా శిండేకు మద్దతుగా నిలుస్తారా.. లేక కొందరైనా ఉద్దవ్‌ థాక్రేవైపు వెళ్తారా అనేది ఓటింగ్‌లో తేలనుంది.

మరిన్ని వార్తలు