‘రాహుల్‌.. ప్రధాని మోదీ వల్లే అంత ప్రశాంతంగా జెండా ఎగరేశావ్‌!’

30 Jan, 2023 10:17 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదివారం జమ్ము కశ్మీర్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో జాతీయ జెండా ఎగరేశారు ఆ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ. అయితే.. 

మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్లే రాహుల్‌ గాంధీ అలా జెండా ఎగరేయడం సాధ్యమైందని బీజేపీ ఎంపీ రవిశంకర్‌ప్రసాద్‌ తెలిపారు. ‘అసలు రాహుల్‌ గాంధీ అంత ప్రశాంతంగా లాల్‌ చౌక్‌లో జెండా ఎలా ఎగరేయగలిగారు? ఆ పరిస్థితులకు కారణం ఆర్టికల్‌ 370 రద్దు కావడం. అది చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం. కాంగ్రెస్‌ హయాంలో కశ్మీర్‌ గడ్డపై ఉగ్రవాదం, ప్రజల భయాందోళనలు మాత్రమే కనిపించేవి. కానీ, 

ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అక్కడ శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. అధిక సంఖ్యలో పర్యాటకులు క్యూ కడుతున్నారు అని రవిశంకర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్‌ రాథోడ్‌ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. 

శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో రాహుల్‌ గాంధీ గర్వంగా జాతీయ జెండాను ఎగరేశారు. అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొనడానికి కారణం ప్రధాని మోదీ అని ఉద్ఘాటించారు. జమ్ము కశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా మాత్రం ఆ క్రెడిట్‌ను ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌ షాకు సైతం దక్కుతుందని పేర్కొన్నారు. ఏడు వసంతాల తర్వాత నెహ్రూ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో జెండా ఎగరేశాడు. ఈ ప్రాంతంలో ప్రశాంతత, సోదర భావం పెంపొందడానికి మోదీ, షాలే ముఖ్యకారకులు అని రైనా పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: నేటితో భారత్‌ జోడో యాత్రకు ముగింపు

మరిన్ని వార్తలు