త్వరలోనే 4 పీఎస్‌యూల ద్వారా టీకా ఉత్పత్తి

12 May, 2021 15:22 IST|Sakshi

విపక్షాలు రాజకీయాలు మాని ఏకతాటిపై నడవాలి: సంబీత్‌ పాత్ర

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే భారత్‌ ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా టీకా తయారీకి అవసరమైన ముడి సరుకులు పంపించాయి’’ అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సంబీత్‌ పాత్ర. మే 1నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించాలని భావించినప్పటికి.. వ్యాక్సిన్‌ల కొరత తీవ్రంగా ఉండటంతో అనుకున్న మేర కార్యక్రమం ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల గురించి పట్టించుకోకుండా.. విదేశాలకు వ్యాక్సిన్‌లను సరఫరా చేసిందని.. ఫలితంగా దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌లకు తీవ్ర కొరత ఏర్పడిందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై సంబీత్‌ పాత్ర స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కోవిషీల్డ్ ఫార్ములా, లైసెన్స్ విదేశాల చేతిలో ఉంది. లైసెన్స్ ఫ్రీ చేయడానికి భారత్, ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రయత్నం చేస్తోంది. కోవాగ్జిన్‌ ఫార్ములా మన దేశానిదే. ఈ వాక్సిన్‌లో సజీవ వైరస్ ఉండడంవల్ల కట్టుదిట్టమైన వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థ భారత్ బయోటెక్ కాకుండా మరో కంపెనీ వద్ద మాత్రమే ఉంది. ఆ కంపెనీతో పాటు మరో నాలుగు పీఎస్‌యూల ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అన్నారు సంబీత్‌ పాత్ర.

‘‘భారత్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఇతర దేశాలకు వ్యాక్సిన్ పంపింది. దానికి బదులుగా వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి సరుకులు పంపించాయి. అలాగే విదేశాల్లోని భారతీయులకు వాక్సిన్ అందజేశారు. వ్యాక్సిన్‌పై కేజ్రీవాల్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. వ్యాక్సిన్లు కొనుగోలుకు ఆర్డరు, అడ్వాన్స్ ఇవ్వకుండా కేజ్రీవాల్ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో రాజకీయాలు మానుకుని ఏకతాటిపై నడవాలి’’ అని సంబీత్‌ పాత్ర ప్రతిపక్షాలకు సూచించారు. 

చదవండి: టీకాలపై తుది మాట మాదే 

మరిన్ని వార్తలు