Delhi Excise Policy Scam: కేజ్రీవాల్‌కు సంకెళ్లే

22 Aug, 2022 05:30 IST|Sakshi

ఎక్సైజ్‌ కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి: బీజేపీ

నాపై లుకౌట్‌ నోటీసు: సిసోడియా

అలాంటిదేమీ లేదన్న సీబీఐ

న్యూఢిల్లీ: ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలే కీలక సూత్రధారి అని బీజేపీ ఆరోపించింది. అతి త్వరలో ఆయనకు సంకెళ్లు తప్పవని జోస్యం చెప్పింది. కరోనా ఉధృతి సమయంలో ప్రజలంతా సాయం కోసం అల్లాడిపోతుంటే కేజ్రీవాల్‌ మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆదివారం ఆరోపించారు. ఆయన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు.

‘‘ఎక్సైజ్‌ విధానం కుంభకోణంలో మూలాలు కేజ్రీవాల్‌ ఇంటికే దారి తీస్తున్నాయి. చట్టానికి ఎవరూ అతీతులు కారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందే’’ అన్నారు. మరోవైపు తనపై సీబీఐ లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసిందని ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీశ్‌ సిసోడియా ఆదివారం ట్వీట్‌ చేశారు. తాను అందరికీ అందుబాటులో ఉన్నా సీబీఐ ఇలా డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ‘‘మోదీజీ! నేనెక్కడున్నానో తెలియడం లేదా? ఎక్కడికి రమ్మన్నా వస్తా’’ అటూ ట్వీట్‌ చేశారు.

తన ఇంట్లో సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తి ఒక్క రూపాయి కూడా సీబీఐకి దొరకలేదన్నారు. సిసోడియా ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఇప్పటిదాకా నిందితులెవరికీ లుకౌట్‌ నోటీసులివ్వలేదని స్పష్టం చేసింది. ‘‘ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు అనుమతి లేకుండా దేశం దాటలేరు. కాబట్టి వారికి ఆ నోటీసులు అవసరం లేదు’’ అని పేర్కొంది. ఈ కేసులో 8 మంది ప్రైవేటు వ్యక్తులకు లుకౌట్‌ నోటీసులిచ్చినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా మాత్రం, కుంభకోణాలకు పాల్పడితే లుకౌట్‌ నోటీసులొస్తాయి తప్ప గ్రీటింగ్‌ కార్డులు కాదనడం విశేషం. కేజ్రీవాల్, మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ కరడుగట్టిన అవినీతిపరులని ఆరోపించారు. సిసోడియా తక్షణం రాజీనామా చేయాలని ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ చౌదరి డిమాండ్‌ చేశారు.

ఇక మోదీ వర్సెస్‌ కేజ్రీ: సిసోడియా
కేజ్రీవాల్‌ ప్రధాని అవుతారని సిసోడియా జోస్యం చెప్పారు. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు అవకాశమిచ్చి చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోదీ వర్సెస్‌ కేజ్రీవాల్‌గా జరగడం ఖాయం’’ అన్నారు. కేజ్రీవాల్‌ మాట్లాడుతూ కేంద్రం రోజూ ఉదయమే సీబీఐ–ఈడీ అంటూ గేమ్‌ ఆడుతోందని దుయ్యబట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన కేంద్రం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.

మరిన్ని హైదరాబాద్‌ లింకులు?
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన పలు హోల్‌సేల్, రిటైల్‌ మద్యం వర్తకుల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో మద్యం లైసెన్సులను దక్కించుకున్న పలువురు వ్యక్తులు, కంపెనీలకు హైదరాబాద్‌ మూలాలున్నాయి. ఇక్కడి అడ్రస్‌లతోనే వారు టెండర్లు దాఖలు చేశారు. ఈ పాలసీకి పాపులారిటీ పెంచేందుకు 50 మంది దాకా స్టాండప్‌ కమేడియన్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయెన్సర్లు తదితరులను పనిముట్లుగా వాడుకున్నట్టు తేలింది. వీరి విదేశీ యాత్రలు, విదేశాల నుంచి అందిన నిధులపై విచారణ సాగుతోంది’’ అని వివరించారు.

మరిన్ని వార్తలు