వ్యాక్సిన్‌ విదేశాలకు ఎందుకంటే.. 

13 May, 2021 01:34 IST|Sakshi

బీజేపీ వివరణ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర బుధవారం వర్చువల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నా యని తెలిపారు. సీరం సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ మేధో హక్కులు ఆస్ట్రాజెనెకాతో ముడిపడి ఉన్నాయన్నారు. మరోవైపు వ్యాక్సిన్ల తయారీకి అవసరమవుతున్న ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు.

ఈ క్రమం లో మొత్తం డోసులను కేవలం భారతీయులకే ఉపయోగించడం కుదరదని, మేధోపర హక్కుల రీత్యా, ఇతర దేశాల నుంచి పొందిన సాయం రీత్యా కొన్ని డోసులను ఎగుమతి చేయాల్సి ఉంటుందన్నారు. కోవిషీల్డ్‌ మేధోపర హక్కులు వేరే సంస్థతో ముడిపడి ఉందన్నారు. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అడిగినట్లు సీరం సంస్థ వ్యాక్సిన్‌ ఫార్ములను ఇతరులకు అందించే అవకాశం లేకుండా పోయిందన్నారు.  చదవండి: (ఆందోళన అవసరం లేదు.. నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదు)

ఇప్పటి వరకూ 1.07 కోట్ల డోసులను ఇతర దేశాలకు సాయం అందజేశామని, 78.5 లక్షల డోసులు ఏడు ఇరుగుపోరుగు దేశాలకు పంపినట్లు తెలిపారు. మరో 2 లక్షల డోసులు ఐక్యరాజ్య సమితికి పంపినట్లు తెలిపారు. దాని ద్వారా పేద దేశాలకు సాయం అందుతుందన్నారు. వాస్తవాలు తెలియకుండా వ్యాక్సిన్‌ ఎగుమతుల గురించి రాజకీయం చేయవద్దంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ కేజ్రీవాల్‌ను కోరారు. 5.50 కోట్ల డోసులను ఉత్పత్తి సంస్థలు కమర్షియల్, లైసెన్సింగ్‌ ఒప్పందాల కింద విదేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపారు. ఎగుమతి చేసిన టీకాల్లో ఇవే 84 శాతమన్నారు.    

మరిన్ని వార్తలు