రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

20 May, 2022 13:31 IST|Sakshi

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలను అందుకుంది. యూపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంది. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే 25 ఏళ్ల పాటు అధికారంలో ఉండేందుకు ప్రణాళికలు రచించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

అయితే, రాజస్థాన్​ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమానికి ప్రధాని వర్చువల్‌గా హజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కుటుంబ పార్టీలపై నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు. 

ఈ క్రమంలోనే దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, భారత్​కు ఉన్న సవాళ్లను అధిగమించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంతో రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించాల్సిన ఆవశ్యకత బీజేపీపై ఉందన్నారు. వాటి కోసం నిరంతరం శ్రమించాల్సిన సమయం బీజేపీకి ఇదేనని పేర్కొన్నారు. దీంతో వచ్చే 25 ఏళ్లపాటు తామే అధికారంలో ఉండాలని భావిస్తున్నట్టు మోదీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా, పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మాట మార్చిన సిద్ధూ.. ప్లీజ్‌ కొంచెం టైమ్‌ ఇవ్వండి

మరిన్ని వార్తలు