పార్టీ మారకుంటే రాష్ట్రపతి పాలనేనట!

16 Feb, 2022 09:07 IST|Sakshi

బీజేపీ నేతలు బెదిరించారు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆరోపణ 

ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమిలోని మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలోకి మారాలని లేదంటే రాష్ట్రపతిపాలనకు సైతం వెనకాడబోమని కేంద్రంలోని మోదీ సర్కార్‌ హెచ్చరికలు చేస్తోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ మంగళవారం ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహావికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కేంద్రంలోని మోదీ సర్కార్‌ కుట్ర చేస్తోందన్నారు. దర్యాప్తు సంస్థలు సోదాలు, ఆకస్మిక దాడుల పేరిట మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌లోని అగ్ర నేతలను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

చదవండి: (సంసద్‌ టీవీ యూట్యూబ్‌ చానల్‌ హ్యాక్‌)

‘‘దాదాపు 20 రోజుల క్రితం కొందరు బీజేపీ నేతలు నన్ను కలిశారు. ‘ఇకపై మాకు విధేయతతో పనిచేయండి. ఏం చేసైనా సరే మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయాలి. రాష్ట్రపతి పాలనకు వెళ్దాం. లేదంటే కూటమిలో చీలిక తెచ్చి ఒక వర్గం ఎమ్మెల్యేలను బయటకు తెద్దాం. మరో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేద్దాం. ఇందుకు మీరు ఒప్పుకోవాలి. దర్యాప్తు సంస్థల దాడులు తప్పవు’’ అని ఆ బీజేపీ నేతలు నాతో చెప్పారని సంజయ్‌ వెల్లడించారు. వారు చెప్పినట్లు ఆ తర్వాత ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కుటుంబ సభ్యుల సంస్థలు, వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు జరిగాయని సంజయ్‌ గుర్తుచేశారు.

చదవండి: (పరీక్షలను బహిష్కరించిన విద్యార్థినులు)

‘నా కుమార్తె పెళ్లికి పనిచేసిన వారినీ ఈడీ వదిలిపెట్టలేదు. పూలు సరఫరా చేసిన వారిని, అలంకరణ చేసిన వారిని, బ్యూటీషియన్‌ను, చివరకు టైలర్‌నూ ప్రశ్నించారు. ఈడీ అంశాన్ని అదే రోజు రాత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకొచ్చాను. ‘మీరు పెద్ద నేత. హోం మంత్రి. ఇదంతా సరైన పద్ధతి కాదు’ అని చెప్పాను’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోనూ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు