ఆ ఆర్థిక అంచనాలు తప్పు!

31 Aug, 2020 14:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభన కారణంగా ప్రపంచంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి జీడీపీ వృద్ధి రేటు మైనస్‌లోకి పడిపోగా, భారత దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడమే కాకుండా సానుకూలంగా పురోభివృద్ది సాధిస్తోందని భారతీయ జనతా పార్టీ ఇటీవల ఓ ట్వీట్‌ చేసింది. అందులో కరోనా సంక్షోభ పరిస్థితులను తట్టుకొని నిలబడడమే కాకుండా పురోభివృద్ధి సాధించిన దేశాలు ప్రపంచంలో రెండో రెండని, అందులో ఒకటి భారత్‌కాగా, మరోటి చైనా అంటూ ఓ గ్రాఫ్‌ను కూడా విడుదల చేసింది. అందులో భారత్‌ పురోభివృద్ధి జీడీపీ రేటును 1.9గా, చైనా వృద్ధి రేటును 1.2గా పేర్కొంది.

ఇక అమెరికా వృద్ధి రేటు మైనస్‌ 5.9, జర్మనీ వృద్ధి రేటు మైనస్‌ 7 శాతం, ఫ్రాన్స్‌ మైనస్‌ 7.2 శాతమని, ఇటలీ వృద్ది రేటు మైనస్‌ 9.1గా పేర్కొంది. ఈ డేటాను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి సేకరించిందని, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తన పేరును నిలబెట్టుకుంటోందని ఐఎంఎఫ్‌ అభివర్ణించినట్లుగా కూడా బీజేపీ తన ట్వీట్‌లో పేర్కొంది. బీజేపీ ట్వీట్‌ను పలు పార్టీ ఎంపీలు మనోజ్‌ రాజోరియా, సుభాశ్‌ భామ్రి, రాజేశ్‌ వర్మ, పరిశోత్తం సబారియా, నిత్యానంద్‌ రాయ్, అర్జున్‌ ముండా తదితరులు రీ ట్వీట్లు కూడా చేశారు.

భారత్‌ సానుకూల అభివృద్ధిని సాధించిందని ఐఎంఎఫ్‌ పేర్కొందా? అతివేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ఆర్థిక పరిస్థితిని ఐఎంఎఫ్‌ అంచనా వేసిందా? లేదనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ బలాబలాలపై ఐఎంఎఫ్‌ ప్రతి ఏటా ఏప్రిల్‌–మే, సెప్టెంబర్‌–అక్టోబర్‌ నెలల్లో తన అంచనాలను విడుదల చేస్తుంది. గత ఏప్రిల్‌ నెలలో ఐఎంఎఫ్‌ విడుదల చేసిన అంచనాల్లో భారత్‌ 1.9 శాతం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ తర్వాత ఐఎంఎఫ్‌ తన అంచనాలను సవరిస్తూ జూన్‌ నెలలో ‘వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ అపేడేట్‌’ పేరిట నివేదిక విడుదల చేసింది. దానిలో భారత్‌ వృద్ధి రేటును ‘మైనస్‌–4.5’గా అంచనా వేసింది.

బీజీపీ సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేసింది. సవరించిన అంచనాలను పరిగణలోకి తీసుకోకుండా అంతకు రెండు నెలల ముందు, అంటే భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేనప్పుడు వేసిన అంచనాలను పరిగణలోకి తీసుకుంది. భారత ఆర్థిక వృద్ధి రేటు సవ్యంగానే ఉంటే జీఎస్టీలో రాష్ట్రాల వాటాను చెల్లించలేనంటూ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేతులు ఎత్తేస్తుంది ?

చదవండి: చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్‌

మరిన్ని వార్తలు