లిక్కర్‌ షాపులు ఇక గోశాలలుగా.. ‘నన్నెవరూ ఆపలేరు..’ బీజేపీ ఉమాభారతి సంచలన ప్రకటన

1 Feb, 2023 11:07 IST|Sakshi

బోఫాల్‌: బీజేపీ ఫైర్‌బ్రాండ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌ దుకాణాలను గో శాలల కింద మార్చేసే కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారామె.  నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లిక్కర్‌ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆమె శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. అయితే గడువు ముగిసినా ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. ఇకపై గో శాలల కింద మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టానంటూ ప్రకటించారామె. 

మధ్యప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మద్యం కారణమని బలంగా నమ్ముతున్నారామె. ఈ క్రమంలో బోఫాల్‌ అయోధ్య నగర్‌లోని ఓ ఆలయం వద్దకు చేరుకుని(సమీపంలోని లిక్కర్‌ షాప్‌ ఉంది) నాలుగు రోజుల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించాలన్న డిమాండ్‌తో ఆమె దీక్ష కొనసాగించారు. మంగళవారం ఆ దీక్ష ముగిసినా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో ఆమె మధుశాలా మే గోశాల(లిక్కర్‌ దుకాణాల్లో గో శాల) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారామె. 

రాముడి పేరు చెప్పుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ, అదే రాముడి గుడి దగ్గర్లో లిక్కర్‌ దుకాణాలు(ఓర్చా ప్రాంతంలో పరిస్థితిని ఉదాహరిస్తూ..) పెట్టడం ఎంత వరకు సమంజసం అని ఆమె మధ్యప్రదేశ్‌ సర్కార్‌ను నిలదీశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద విషయం కాదు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం, మహిళలకు.. భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించడం నిజమైన అభివృద్ధి అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక..

పార్టీలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వర్గంపైనా ఆమె అసహనం వ్యక్తం చేశారు. మద్యం నిషేధంపై ఉద్యమించినంత మాత్రానా నాకు ప్రధాని పదవి దక్కుతుందా?.. ఇది చాలా విడ్డూరంగా ఉంది.. ఒక వర్గం ఇలా ప్రచారం చేయడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. 

లిక్కర్‌ పాలసీ కోసం ఎదురు చూపులు ఉండబోవని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న లిక్కర్‌ షాపులను దగ్గరుండి తానే గోశాలలుగా మారుస్తానని ఆమె ప్రకటించారు. అలాంటి దుకాణాల బయట 11 ఆవుల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తన బృందానికి ఆదేశాలు జారీ చేశానని..  తనను ఆపే ధైర్యం ఎవరికి ఉందో చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారామె. 

ఈమధ్యే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కలిసిన ఉమాభారతి.. లిక్కర్‌ పాలసీలో కొన్ని సవరణలు సూచిస్తూ.. కొత్త విధానం తేవాలని కోరారు. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు కూడా. అయితే.. ఆచరణలోనే అది కనిపించలేదు.  ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మరిన్ని వార్తలు