కార్పొరేట్లకు కాదు, గుత్తాధిపత్యాలకే వ్యతిరేకం

9 Oct, 2022 05:36 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ స్పష్టీకరణ 

గౌతమ్‌ అదానీకి రాజస్తాన్‌ సర్కారు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వట్లేదు 

ఆయనకు తప్పుడు మార్గాల్లో ప్రయోజనం చేకూరిస్తే వ్యతిరేకిస్తా  

పెట్టుబడులు వస్తుంటే కాదనడం సరైన పద్ధతి కాదు

తురువెకెరే/జైపూర్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీకి రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. కార్పొరేట్లకు తాను వ్యతిరేకం కాదని, కేవలం గుత్తాధిపత్యాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ రాజస్తాన్‌ ప్రభుత్వం తప్పుడు మార్గాల్లో అదానీకి ప్రయోజనం చేకూరిస్తే మాత్రం తాను కచ్చితంగా వ్యతిరేకిస్తానని రాహుల్‌ తేల్చిచెప్పారు. ఆయన శనివారం కర్ణాటకలో మీడియాతో మాట్లాడారు. ‘‘రాజస్తాన్‌లో రూ.60,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతానని అదానీ ప్రకటించారు. ఈ ఆఫర్‌ను ఏ ముఖ్యమంత్రి కూడా తిరస్కరించలేరు.

భారీ ఎత్తున పెట్టుబడులు వస్తుంటే కాదనడం సరైన పద్ధతి కాదు. బడా వ్యాపారవేత్తల ప్రయోజనం కోసం రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదన్నదే నా ఉద్దేశం. దేశంలో ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు ప్రతి వ్యాపారంలో గుత్తాధిపత్యం సాధించేలా అధికారంలో ఉన్న వ్యక్తులు రాజకీయంగా తోడ్పాటు అందిస్తుండడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కార్పొరేట్లకు, వ్యాపారాలకు నేను ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. దేశంలో కొందరు మాత్రమే అన్ని వ్యాపారాలను పూర్తిగా హస్తగతం చేసుకోవడాన్ని తప్పుపడుతున్నా. ఎందుకంటే అలాంటి విధానం మన దేశాన్ని బలహీనపరుస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అదే పని చేస్తోంది. ఎంపిక చేసుకున్న కొందరు వ్యాపారవేత్తలకు మాత్రమే మేలు చేయాలని ఆరాట పడుతోంది’’ అని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.  

పెట్టుబడులు వద్దంటారా?: జైరామ్‌ రమేశ్‌  
రాజస్తాన్‌ సీఎం గెహ్లాట్‌తో గౌతమ్‌ అదానీ సమావేశంపై మీడియా లేనిపోని రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ చెప్పారు. ఈ మేరకు శనివారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దని ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారా? అని ప్రశ్నించారు. రాజస్తాన్‌లో అదానీకి ప్రత్యేక నిబంధనలు, విధానాలు ఏవీ లేవని అన్నారు. మోదీ పాలనలోని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి గెహ్లాట్‌ వ్యతిరేకమేనని జైరామ్‌ రమేశ్‌ వివరించారు. రాజస్తాన్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గౌతమ్‌ అదానీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదానీపై రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రశంసల వర్షం కురిపించడం పట్ల బీజేపీ నాయకులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. అదానీ ప్రధాని మోదీకి బాగా కావాల్సిన మిత్రుడని రాహుల్‌ గాంధీ విమర్శిస్తుంటారని, మరి ఇప్పుడేమంటారని నిలదీస్తున్నారు.  

అదానీ, అంబానీ, జై షా.. ఎవరొచ్చినా స్వాగతిస్తాం: అశోక్‌ గెహ్లాట్‌  
గౌతమ్‌ అదానీ అయినా, ముకేశ్‌ అంబానీ అయినా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తనయుడు జై షా అయినా.. ఎవరైనా సరే తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే కచ్చితంగా ఆహ్వానిస్తామని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఉద్ఘాటించారు. పెట్టుబడులు రావాలని, తద్వారా తమ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని కోరుకుంటున్నామని చెప్పారు. అదానీతో తన భేటీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను గెహ్లాట్‌ ఖండించారు. శుక్రవారం జరిగింది ప్రైవేట్‌ కార్యక్రమం కాదని, పెట్టుబడుల సదస్సు అని, 3,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. పెట్టుబడులకు అవరోధాలు సృష్టించవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు.

మరిన్ని వార్తలు