BJP: స్థానికంలో ఒంటరిపోరు

25 Jul, 2021 08:22 IST|Sakshi

క్షేత్రస్థాయిలో కమలం గుర్తు ప్రాచుర్యంపై బీజేపీ దృష్టి 

అన్నాడీఎంకేతో సామరస్య సంబంధాలు 

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. కమలం గుర్తును క్షేత్రస్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశంగా మలుచుకోవాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. గడిచిన తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగాయి. బీజేపీ 4 స్థానాలతో అసెంబ్లీలో అడుగుపెట్టింది. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం వల్లనే అధికారంలోకి రాలేకపోయామనే భావన అన్నాడీఎంకే శ్రేణుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాబోయే సెప్టెంబర్‌ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో కూటమి అవసరం లేదని బీజేపీ భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అన్నామలై ఇటీవల తరచూ జిల్లాల వారీగా కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తూ పార్టీ స్థితిగతులను, కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అంశాన్ని చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల్లో స్థానికంగా పార్టీకున్న బలం, పట్టు, అభ్యర్దికి ఉన్న ప్రజాదరణపై గెలుపు ఆధారపడి ఉంటుందని పలువురు నేతలు ఆయన వద్ద అభిప్రాయపడ్డారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అవసరం, అయితే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వాడుకోవడమే మేలని ఎక్కువశాతం అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి లేకుంటే క్షేత్రస్థాయి వరకు కమలం గుర్తుపై పోటీచేసే అవకాశం కలుగుతుంది.

ప్రజల్లో కమలం గుర్తును తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక మహత్తర అవకాశం. అదే సమయంలో మిత్రపక్ష అన్నాడీఎంకేతో సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించాలని మరికొందరు సూచించారు. ఈ కొత్త ప్రయత్నానికి మొత్తం మీద ఒంటరి పోటీకే ఎక్కువమంది ఓటేశారు. ఒంటరిగా పోటీ దిగితే డిపాజిట్‌ కూడా దక్కదేమో అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి వల్లనే ఆసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందారా అని పార్టీ అధిష్టానం మండిపడింది. నాగర్‌కోవిల్‌కు చెందిన సీనియర్‌ నేత ఎంఆర్‌ గాంధీ అనేకసార్లు ఓటమి పాలయినా అతనిపై ఉన్న మంచి అభిప్రాయమే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిందని హితవు పలికింది.

తిరునెల్వేలీలో నయనార్‌ నాగేంద్రన్‌ గెలుపుకు వ్యక్తిగత పరపతి, దేవేంద్రకుల సామాజిక సమీకరణ సహకరించింది. కోయంబత్తూరు నియోజకవర్గంలో మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్‌హాసన్‌కు పెద్ద సంఖ్యలో ఓట్లు పోలైనా బీజేపీ అభ్యర్థి వానతీ శ్రీనివాసనే గెలుపొందింది. మొట్టకురిచ్చిలో డీఎంకే అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బీజేపీకి గెలుపుబాటలు వేసింది. కూటమి వల్లనే గెలుపు అనే భావన ఉంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సహా పలువురు ఎందుకు ఓటమిపాలయ్యారని కొందరు ప్రశ్నలేవనెత్తారు. కూటమిపై ఆధారపడడం మానుకుని పార్టీ ప్రగతిపై దృష్టిపెట్టండని బీజేపీ అధిష్టానం, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలు హితవుపలికారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరు దాదాపు ఖాయమైనట్లేనని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.

మరిన్ని వార్తలు