మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం

1 Dec, 2020 16:44 IST|Sakshi

బెంగళూరు: ఎమ్మెల్యే, అతడి అనుచరులు దాడి చేయడంతో తనకు అబార్షన్‌ అయ్యిందంటూ ఓ మహిళా నాయకురాలు సొంత పార్టి ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసింది. బాధితురాలిని స్థానిక బీజేపీ నాయకురాలు‌, మహాలింగాపూర్‌ టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ చాందిని నాయక్‌గా గుర్తించారు. గత నెల 9న ఈ దారుణం చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక గత నెల 9న మహాలింగాపూర్‌ టౌన్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌కి సంబంధించి ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. చాందిని నాయక్‌ ఓటు వేయడానకి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గర్భవతి అయిన చాందిని నాయక్‌ కింద పడిపోయింది. దాంతో ఆమెకు గర్భస్రావం అయినట్లుగా తెలిసింది. 

దీనిపై చాందిని నాయక్‌, ఆమె భర్త నగేష్‌ నాయక్‌.. మరో బీజేపీ లీడర్‌ సాయంతో స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎమ్మెల్యే సిద్దూ సవధి మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాందిని నాయక్‌ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే రౌడీయిజం చేశారు. నన్ను కిందపడేశారు. ప్రజాప్రతినిధి అయ్యుండి.. ఓ మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏంటి?.. ఇలాంటి నాయకులు ఉంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడతారు.. ప్రధాని ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినాదాలు చేస్తారు.. ఎమ్మెల్యేలు మాత్రం మహిళలు పట్ల ఇలా దారుణంగా ప్రవర్తిస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే సవధి స్పందించారు. చాందిని నాయక్‌ తనపై చేసినవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ ఖండించారు. ‘‘చాందిని నాయక్‌కు సంబంధించిన ఆస్పత్రి రికార్డులు సేకరించాను. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ట్యూబెక్టమీ అయ్యిందని తెలిసింది. ఒక రోజులో నేను ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తాను” అన్నారు. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని.. ఆమెకు ఎలాంటి గర్భస్రావం జరగలేదని ఆసుపత్రి అధికారులు తనకు తెలియజేశారని సవధి తెలిపారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను)

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బ్రిజేష్ కలప్ప ఈ వివాదంపై స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు., “బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి గర్భవతి అయిన కౌన్సిలర్ చాందిని నాయక్ మీద దాడి చేసిన వీడియోలను మేం టీవీ చూసి చాలా భయపడ్డాము. ఎమ్మెల్యే క్రూరత్వం వల్ల ఆమెకు గర్భస్రావం అ‍య్యింది. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలదా?!” అంటూ సవాలు చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా