కాంగ్రెస్‌కు షాక్‌ మీద షాక్‌: ఆ సీటు కమలం ఖాతాలోకి

22 Feb, 2021 21:34 IST|Sakshi

అహ్మదాబాద్‌: పుదుచ్చేరిలో అధికారంలో కోల్పోయి షాక్‌లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. సిట్టింగ్‌ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. పార్టీకి నమ్మిన బంటుగా పని చేసిన అహ్మద్‌ పటేల్‌ స్థానాన్ని కమలం తన ఖాతాలో వేసుకుంది. ఆయన మృతితో ఏర్పడిన రాజ్యసభ స్థానాన్ని కాషాయ పార్టీ దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్‌ బలం రాజ్యసభలో తగ్గింది. బీజేపీ వివిధ మార్గాల ద్వారా రాజ్యసభలో బలం పెంచుకుంటోంది.

గుజరాత్‌ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న అహ్మద్‌ పటేల్‌, అభయ్‌ భరద్వాజ్‌ అనారోగ్యంతో గతేడాది మృతిచెందారు. అయితే గుజరాత్‌లో అధికార పార్టీగా ఉన్న బీజేపీ పక్కా వ్యూహంతో అడుగులు వేయడంతో ఆ రెండు ఎంపీ స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. ఎమ్మెల్యేల ఓటింగ్‌తో రాజ్యసభ స్థానాలు కమల దళానికి దక్కాయి. దీంతో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది.

ఆ స్థానాల్లో దినేశ్‌చంద్ర జెమల్‌భాయ్‌ అనవడియా, రామ్‌భాయ్‌ మోకారియా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అహ్మద్‌ పటేల్‌ స్థానంలో దినేశ్‌ చంద్ర గెలుపొందగా.. అభయ్‌ స్థానంలో రామ్‌భాయ్‌ గెలిచారు. దీంతో బీజేపీ గుజరాత్‌లో పట్టు నిలుపుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు