నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్‌!.. అడ్డుకుని తీరతామంటూ..

4 Jun, 2022 07:49 IST|Sakshi

తనను తానే పెళ్లాడి.. ఎంచక్కా సోలో హనీమూన్‌ ప్లాన్‌ చేసుకున్న గుజరాత్‌ యువతికి షాక్‌ తగిలింది. ఆమె వివాహాన్ని అడ్డుకుని తీరతామని బీజేపీ ప్రకటించింది. 

వడోదరా మాజీ డిప్యూటీ మేయర్‌ సునీతా శుక్లా ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వడోదరాకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు తనను తాను పెళ్లి చేసుకుంటానని(మోలోగమీ) ప్రకటించుకుంది. సాధారణ పెళ్లి లాగే అంతా పద్ధతి ప్రకారం వివాహం కోసం ఏర్పాట్లు చేసుకుంటోంది. అన్ని ఆర్భాటాలతో (ఒక్క వరుడు, బరాత్‌) తప్పా అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోవాలనుకుంది. అయితే.. 

క్షమా ప్రకటన మీడియా, సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. దేశంలో ఇదే తొలి సోలోగమీ వివాహమంటూ చర్చ కూడా నడుస్తోంది. చాలామంది వ్యతిరేకిస్తుంటే.. కొందరు ఆమెకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షమా ప్రకటనను సునీతా శుక్లా తీవ్రంగా ఖండించారు. క్షమా వివాహాన్ని అడ్డుకుని తీరతామని ప్రకటించారామె. 

‘‘ఈ తరహా వివాహాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఆమె ఏ గుడిలో వివాహం చేసుకోవడానికి మేం అనుమతించం. ఇలాంటి వివాహాలు హిందూ మతానికి, భారత సంప్రదాయానికి విరుద్ధం. ఇలాంటి వాళ్ల చేష్టలతో హిందువుల జనాభా తగ్గే ప్రమాదం ఉంది. మతానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే.. ఏ చట్టమూ ఒప్పుకోదు’’ అని పేర్కొన్నారామె.

ఇదిలా ఉంటే.. హరిహరేశ్వర్‌ ఆలయంలో తనను తాను వివాహం చేసుకునేందుకు జూన్‌ 11న ముహూర్తం ఖరారు చేసుకుంది క్షమా బిందు. తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి..

మరిన్ని వార్తలు