కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి

7 May, 2021 19:50 IST|Sakshi
సూరత్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో చూపు కోల్పోయిన బాధితురాలు

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావంతో కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆ వైరస్‌ ప్రజలను భయాందోళనలో నెట్టివేయగా ఈ వైరస్‌ ప్రభావంతో మరో ప్రమాదకర పరిస్థితులు వచ్చి పడ్డాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి కంటి చూపు పోతోంది. దేశంలో అక్కడక్కడ ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒక ఫంగస్‌ రావడంతో దాని వలన కరోనా నుంచి కోలుకున్న వారి చూపు మందగిస్తోందని తెలుస్తోంది. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఫంగస్‌ బారిన 40 మందికి పైగా పడ్డారని తెలుస్తోంది. 

సూరత్‌లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించారు. వారిని పరిశీలించగా బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకోర్మిసిస్‌) అనేది రావడంతో వారి చూపు పోయిందని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్‌పై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ ఫంగస్‌ ప్రాణాంతకమని కూడా హెచ్చరిస్తున్నారు.  అయితే ఈ ఫంగస్‌ రావడానికి గల కారణాలను గుర్తించారు.

ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం అధిపతి డాక్టర్‌ అజయ్‌ స్వరూప్‌ ఫంగస్‌ కారణాలు వివరించారు. ‘కరోనా బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహం వారు ఉన్నారని, కరోనా నివారణకు తీసుకున్న ఔషధాల వలన ఈ ఫంగస్‌ రావడానికి కారణం’ అని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ఫంగస్‌ బారినపడే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. మధుమేహం, కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్‌ బాధితులకు ఈ ఫంగస్‌ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే ఈ ఫంగస్‌ వస్తే కొందరికి కంటిచూపు కోల్పోగా మరికొందరి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

చదవండి: ‘కదిలావో కాల్చేస్తా..’ టీచర్‌ను బెదిరించిన బాలిక
చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’

మరిన్ని వార్తలు