Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధి కాదు

25 May, 2021 05:55 IST|Sakshi
రణదీప్‌ గులేరియా

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనాతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ సంక్రమణపై ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా మాట్లాడారు. బ్లాక్‌ ఫంగస్‌ అంటువ్యాధి ఏమాత్రం కాదని, కరోనా మాదిరిగా ఇది ఒక వ్యక్తి నుండి మరొకరికి సంక్రమించదని ఆయన పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ డయాబెటిస్‌ రోగికి మ్యూకోర్‌మైకోసిస్‌(బ్లాక్‌ ఫంగస్‌) ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గులేరియా సోమవారం తెలిపారు.

దేశంలో మ్యూకోర్‌మైకోసిస్‌ కేసులు వేగంగా పెరుగుతున్నందున, ఈ వ్యాధిని విస్మరించలేమని అన్నారు. ఈ సంక్రమణకు చికిత్సను ప్రారంభంలోనే మొదలుపెడితే ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వ్యక్తి దగ్గర కూర్చోవడం వల్ల ఇతరులకు ఈ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ వ్యాపించదని ఆయన స్పష్టం చేశారు.  

డయాబెటిస్‌ లేని వారిపై  తక్కువ ప్రభావం
మధుమేహం లేని, కరోనా చికిత్స సమయంలో స్టెరాయిడ్‌ తీసుకోని రోగుల్లో మ్యూకోర్‌మైకోసిస్‌ ప్రభావం చాలా తక్కువగా ఉందని డాక్టర్‌ గులేరియా తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ ఆక్సిజన్‌ ద్వారా వ్యాపించదని, ఫంగస్‌ ఉన్నవారిలో 92–95% మందికి డయాబెటిస్‌ లేదా స్టెరాయిడ్‌ వాడకం ఉందని ఆయన తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ సంక్రమణకు ఆక్సిజన్‌ కారణమనేది ఒక పెద్ద అంశం కాదని, పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని సూచించారు.  కోవిడ్‌ పాజిటివ్‌గా ఉన్నప్పుడు దుందుడుకు వైఖరితో ఆపరేషన్‌ చేయడం కారణంగా రోగి మరణించే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ ఉన్న కరోనా రోగులకు నెగెటివ్‌ వస్తే వారిని వేరే వార్డుకు మార్చాల్సి ఉంటుందన్నారు.

వారికి వైద్య సాయం కొనసాగాలి
కరోనా నుంచి కోలుకొనే వారితో పాటు కోలుకున్న వారికి సైతం కొన్ని వారాల పాటు వైద్య సహాయం అవసరమని డాక్టర్‌ గులేరియా అన్నారు.  4–12 వారాల పాటు కరోనా లక్షణాలు కనిపిస్తే, దీనిని ఆన్‌గోయింగ్‌ సింప్టమాటిక్‌ కోవిడ్‌ లేదా పోస్ట్‌–అక్యూట్‌ కోవిడ్‌ సిండ్రోమ్‌ అని అంటారని తెలిపారు. 12 వారాల కంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే, దీనిని పోస్ట్‌–కోవిడ్‌ సిండ్రోమ్‌ లేదా నాన్‌–కోవిడ్‌ అంటారని డాక్టర్‌ గులేరియా వివరించారు. కోలుకున్న వారిలో ఊపిరితిత్తుల పనితీరు, సామర్థ్యం సాధారణంగానే ఉన్నప్పటికీ శ్వాసలో ఇబ్బంది, దగ్గు, ఛాతీనొప్పి, పల్స్‌ రేటులో పెరుగుదల వంటి లక్షణాలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ లక్షణాలు పోస్ట్‌ కోవిడ్‌ సమయంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన కారణంగా ఉంటాయని ఆయన వివరించారు. కోలుకున్న వారిలో కనిపించే మరో సాధారణ లక్షణం క్రొనిక్‌ ఫెటీగ్‌ సిండ్రోమ్‌. ఇందులో కీళ్ల నొప్పులు, అలసటతో శరీరం నొప్పి, తలనొప్పి ఉంటుందని గులేరియా పేర్కొన్నారు. అందుకే ఈ వైరల్‌ వ్యాధి నుంచి కోలుకున్నవారికి పునరావాసం కల్పించేందుకు మల్టీ–డిసిప్లినరీ పోస్ట్‌–కోవిడ్‌ క్లినిక్‌ల అవసరం ఎంతో ఉందని ఆయన సూచించారు.  

ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు  రంగుల పేర్లు వద్దు
ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను రంగుల పేర్లతో కాకుండా, మెడికల్‌ పరిభాషలోని పేర్లతోనే గుర్తించడం మంచిదని గులేరియా వ్యాఖ్యానించారు. బ్లాక్‌ ఫంగస్, వైట్‌ ఫంగస్‌ అంటూ ఈ ఇన్ఫెక్షన్లను గుర్తించడంతో గందరగోళానికి అవకాశముందన్నారు. శరీరంలో ఆ ఫంగస్‌ పెరిగే ప్రదేశంపై ఫంగస్‌ రంగు అనేది ఆధారపడి ఉంటుందన్నారు. బ్లాక్‌ ఫంగస్‌గా పిలిచే మ్యుకర్‌మైకోసిస్‌ వైట్‌ కలర్‌ ఫంగల్‌ కాలనీల్లో బ్లాక్‌ డాట్స్‌తో ఉంటుందన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మ్యుకర్‌మైకోసిస్, క్యాండిడా, ఆస్పర్‌జిల్లస్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయని గులేరియా తెలిపారు.

థర్డ్‌ వేవ్‌లో చిన్నారులకు ముప్పు సూచనల్లేవ్‌
దేశంలో మరికొన్ని నెలల్లో కోవిడ్‌–19 థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలే వైరస్‌ బారినపడతారన్న వాదనల్లో వాస్తవం లేదని గులేరియా చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్‌లో చిన్నారులు తీవ్రం గా ప్రభావితం అవుతారని, ఎక్కువ మం దికి వైరస్‌ సోకుతుందని చెప్పడానికి  ఎలాంటి సూచనలు, ఆధారా ల్లేవని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటా యని చెప్పారు. ఒకవేళ వారు వైరస్‌ బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలే కనిపిస్తాయని, చికిత్సతో వారు ఆరోగ్యవంతులవుతారని వివరించారు. .

మరిన్ని వార్తలు