విపక్షాల భేటీలో ఊహించని పరిణామం.. కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే

27 Mar, 2023 13:59 IST|Sakshi

ఢిల్లీ: కేంద్రాన్ని తీరును ఎండగట్టేందుకు ఇవాళ విపక్షాలు ఏకమయ్యాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఇవాళ జరిగిన భేటీకి హాజరై.. ఆపై నిరసనల్లో సంఘటితంగా మోదీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. రాహుల్‌ గాంధీ అనర్హత వేటును వ్యతిరేకిస్తూ సాగిన నల్ల దుస్తుల నిరసనలో విపక్షాలు ఒక్కటిగా ముందుకు సాగడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. ఖర్గే నేతృత్వంలో విపక్షాల వ్యూహత్మాక సమావేశం జరిగింది. ఆయన కార్యాలయంలో జరిగిన భేటీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్‌ కావాలని బలంగా కోరుకుంటున్న టీఎంసీ సైతం ఈ భేటీకి హాజరైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ తరపున ప్రసూన్‌ బెనర్జీ, జవహార్‌ సిర్కార్‌లు విపక్షాల వ్యూహత్మాక సమావేశానికి హాజరయ్యారు. 

రాహుల్‌ గాంధీ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నా.. టీఎంసీ తన మద్దతును ఈ అంశానికే పరిమితం చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక.. కాంగ్రెస్‌ ఈ పరిణామాన్ని స్వాగతించింది.  మొత్తం పదిహేడు పార్టీలు హాజరయ్యాయి ఈ భేటీకి. నల్ల దుస్తుల నిరసనలు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ సైతం పాల్గొంది. 

దీనికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకే, నిన్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను, ఈరోజు కూడా కృతజ్ఞతలు చెప్పాను. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు, ప్రజలను కాపాడేందుకు ఎవరైనా ముందుకు వచ్చినా స్వాగతిస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఖర్గే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు