Sudesh Ramakant Narvekar: వందోసారి రక్తదానం

3 Oct, 2022 04:20 IST|Sakshi

 గోవా బ్లడ్‌మ్యాన్‌ ఘనత

పణజీ: ప్రమాదంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి రక్తమిచ్చి సాయపడిన సుదేశ్‌ ఆ తర్వాతా ఆ పరంపరను కొనసాగించారు. అనుకోకుండా మొదలైన రక్తదాన వ్రతం ఇటీవల శతకం పూర్తిచేసుకుంది. గోవా బ్లడ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఆయన పూర్తి పేరు సుదేశ్‌ రమాకాంత్‌ నర్వేకర్‌. 51 ఏళ్ల వయసున్న సుదేశ్‌ 18 ఏళ్ల వయసులో తొలిసారి రక్తదానం చేసి తోటి వ్యక్తికి సాయపడితే వచ్చే ఆత్మ సంతృప్తికి ఫిదా అయ్యాడు. అప్పటి నుంచి గత 33 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి సాయంగా రక్తదానం చేస్తూనే ఉన్నాడు.

దక్షిణ గోవాలోని పండాలో నివసించే సుదేశ్‌ ఇటీవల వందోసారి రక్తదానం చేసిన సందర్భంగా ఆయనను పీటీఐ పలకరించింది. ‘ టీనేజీలో ఉన్నపుడు ఒక యాక్సిడెంట్‌లో రక్తమోడుతున్న వ్యక్తికి బ్లడ్‌ ఇచ్చాకే తెలిసింది ఆపత్కాలంలో సాయపడటం ఎంత ముఖ్యమో. అందుకే నాకు తోచినంతలో ఇలా ఆపదలో ఉన్న వారికి సాయమందిస్తున్నా. భారత్‌లో వంద సార్లు రక్తదానం చేయడం అరుదు అని ఈమధ్యే తెలిసింది’ అని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సుదేశ్‌ అన్నారు.

‘ మొదట్లో ఏడాదికి రెండు సార్లు డొనేషన్‌ చేసేవాడిని. తర్వాత శిబిరాలు పెరిగేకొద్దీ ఎక్కువసార్లు ఇవ్వడం స్టార్ట్‌చేశా. బెంగళూరు, పుణె, హుబ్లీ, బెళగామ్‌సహా పొరుగు రాష్ట్రాల్లోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశా. మూడేళ్ల క్రితం పది మంది స్నేహితులతో కలిసి సార్థక్‌ ఎన్‌జీవోను ప్రారంభించా. గోవా అంతటా క్యాంప్‌లు నిర్వహించాం. ఇప్పుడు వైద్యులతో కలిసి 30 మంది బృందంగా ఏర్పడి ఎన్‌జీవో సేవ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాం. ఒక్క గోవా మెడికల్‌ కాలేజీలోనే 90సార్లు క్యాంప్‌లు పెట్టాం. గోవా విషయానికొస్తే మహిళలు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలకు వచ్చి బ్లడ్‌ డొనేట్‌ చేస్తున్నారు’ అని సుదేశ్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు