మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు

1 Mar, 2021 02:34 IST|Sakshi

కోవిడ్‌ నిబంధనలు పరిశీలిస్తారు 

బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాణి 

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, బారసాలు, పూజలు ఇతర శుభకార్యాలు జరిగే చోట ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యటిస్తారని బీఎంసీ అదనపు కమిషనర్‌ సురేశ్‌ కాకాణి తెలిపారు. అక్కడ కరోనా నియమాలు పాటిస్తున్నారా...? లేదా..? ఎంతమంది హాజరయ్యారు...? ఒకవేళ ఉల్లంఘన జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు.  

వీడియోలు పరిశీలన.. 
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో రోజురోజుకు కరోనా విస్తరిస్తుండడంతో బీఎంసీ అధికారులకు కంటిమీద కినుకులేకుండా పోయింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా శుభకార్యాలు జరుగుతున్న పంక్షన్‌ హాళ్లకు, మైదానాల్లోకి బంధువుల రూపంలో బీఎంసీ సిబ్బంది మారువేషాల్లో వెళతారు. అక్కడ వేదికపై ఎంత మంది బంధువులున్నారు? 50 మంది బంధువుల కంటే ఎక్కువ ఉన్నారా..? కరోనా నియమాలు పాటిస్తున్నారా..? లేదా..? అనేది నిర్ధరించుకుంటారు. అవసరమైతే వీడియోగ్రాఫర్లు చిత్రీకరించిన క్లిప్పింగులను పరిశీలించే అధికారాలు కూడా సిబ్బందికి కట్టబెట్టినట్లు కాకాణీ చెప్పారు. ఒకవేళ మాస్క్‌లు ధరించని, భౌతిక దూరం పాటించని పక్షంలో నిర్వాహకులపై చర్యలు తీసుకుంటారు.

అవసరమైతే స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసులు కూడా నమోదు చేస్తారు. నగరంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో బీఎంసీ పరిపాలన విభాగం అనేక ఆంక్షలు విధించింది. ప్రైవేటు, వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాల్లో 50 శాతం హాజరుండాలని నిబంధన విధించింది. కోవిడ్‌ నియమాలు కచ్చితంగా అమలుచేస్తున్నారా అనేది నిర్ధరించుకునేందుకు అకస్మాత్తుగా బీఎంసీ అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. నియమాల ఉల్లంఘన జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి గతంలో కంటే ఇప్పుడే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.   

చదవండి: (కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్‌డౌన్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు