మాస్క్‌ ఎఫెక్ట్‌: రూ.30 కోట్ల ఆదాయం

24 Feb, 2021 10:14 IST|Sakshi

మాస్క్‌ నియమం ఉల్లంఘనతో బీఎంసీకి భారీ ఆదాయం

మంగళవారం ఒక్క రోజులోనే రూ. 45.95 లక్షలు వసూలు

ముంబై: తగ్గిందనుకున్న కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కోవిడ్‌ కేసులు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రంగంలోకి దిగిన ప్రభుత్వం మరోసారి కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధిస్తోంది. ఈ క్రమంలో బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) నిన్న ఒక్క రోజులోనే ముంబైలో జరిమానాల రూపంలో 29లక్షల రూపాయలు వసూలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించని 14,600 మంది నుంచి ఈ మొత్తం వసూలు చేసినట్లు బీఎంసీ వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం మొత్తం మీద 22,976 మంది నుంచి 45.95 లక్షల రూపాయల జరిమానా వసూలు చేసినట్లు బీఎంసీ ప్రకటించింది. ముంబైలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ కఠినమైన చర్యలు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మొత్తం వసూలు చేయడం గమనార్హం. బీఎంసీ  తాజా మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. ఈ నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే  వారికి 200 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇక 2020 ఏడాది మొత్తం మీద మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా 30,50,00,000 రూపాయలు వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది.

మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముంబై పోలీస్,సెంట్రల్, వెస్ట్రన్ రైల్వే వంటి వివిధ ఏజెన్సీలు మాస్క్‌ ధరించని వారి నుంచి వసూలు చేసిన జరిమానాల మొత్తానికి సంబంధించిన డాటాను బీఎంసీ విడుదల చేయడం ప్రారంభించింది. సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌న్‌ను నడుపుతున్న సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు ఇప్పటివరకు రూ. 91,800 రూపాయలు జరిమానాగా వసూలు చేశాయి.

బీఎంసీ గణాంకాల ప్రకారం సంస్థ ప్రతి రోజు మాస్క్‌ ధరించని సుమారు 13,000 మంది నుంచి రోజుకు సగటున 25 లక్షల రూపాయలకు పైగా వసూలు చేస్తోంది. జరిమానా కట్టలేని వారితో వీధులు ఊడ్చడం వంటి పనులు చేపిస్తోంది.పెరుగుతున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో ఉంచుకుని గత వారం, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తాజా ఆంక్షలను ప్రకటించారు. లాక్‌డౌన్‌ విధించాలా వద్దా అని నిర్ణయించడానికి వచ్చే ఎనిమిది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని ఠాక్రే చెప్పారు.

చదవండి: 
ఇలానే ఉంటే మరో 15 రోజుల్లో లాక్‌డౌన్‌: సీఎం
పొంచి ఉన్న ‘మహా’ ముప్పు!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు